అధ్యక్షా… తమ్మినేని సీతారాంకి కొత్త సమస్య!

2004లో టీడీపీ నుంచి, 2009లో పీఆర్పీ నుంచి, 2014లో వైసీపీ నుంచి వరుసగా ఓటమి చవిచూసిన తమ్మినేని సీతారాం… పట్టువిడువని విక్రమార్కుడిలా పోరాడి 2019 ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించారు. అనంతరం అసెంబ్లీలో “అధ్యక్షా” అనిపించుకున్నారు. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో కూడా గెలిస్తే.. ఒకసారి “అమాత్యా”అని కూడా అనిపించుకోవాలని తాపత్రయ పడుతున్నారని తెలుస్తుంది. అయితే ఆ కోరికకు సొంతపార్టీలో నుంచే చిక్కులు ఎదురవుతుండటం ఇప్పుడు ఆయనకు పెద్ద తలనొప్పిగా తయారైందని అంటున్నారు.

తమ్మినేని సీతారాంకు శత్రువులు ఎక్కడినుంచో రానవసరం లేదు.. సొంత కుటుంబంలోనూ, సొంత పార్టీలోనే ఉంటుంటారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గంలో… ఆయన ప్రత్యర్థి మరెవరో కాదు.. ఆయన మేనల్లుడు కూన రవికుమారే! దీంతో… అముదాలవలసలో మామా అల్లుళ్ల మధ్యే పొలిటికల్ పోరు నడుస్తుంటుంది. దశాబ్ధ కాలంలో ఈ నియోజకవర్గంలో ప్రధాన పోటీ వీరిద్దరి మధ్యే ఉంటుంది.

ఈ నేపథ్యంలో 2014లో సీతారాంని మేనల్లుడు కూన 5,449 ఓట్ల తేడాతో ఓడిస్తే… 2019 ఎన్నికల్లో మేనల్లుడు కూనను తమ్మినేని 13,911 ఓట్ల తేడాతో ఓడించారు. మరోసారి మేనల్లుడిని ఓడించి ఈసారి అమాత్యుల జాబితాలో చేరాలని తపిస్తున్నారు! ఆ పక్కపార్టీ ప్రత్యర్థి సంగతి అలా ఉంటే… ఇప్పుడు సొంతపార్టీలోనే తమ్మినేనికి మరో రెండు గ్రూపులు ఇంటర్నల్ ప్రత్యర్థులుగా ఉన్నాయి. దీంతో ఇప్పుడు వాళ్లను కూల్ చేయడమే తమ్మినేనికి తలకు మించిన భారం అవుతుందని అంటున్నారు.

ప్రస్తుతం ఆముదాలవలస వైసీపీలో తమ్మినేని కుటుంబంతో పాటు పొందూరు మాజీ ఎంపీపీ సువ్వారి గాంధీ, చింతాడ రవికుమార్ లు రెండు వర్గాలుగా ఏర్పడ్డారు. ఈ సమయంలో మరోసారి టిక్కెట్ తనకే అని తమ్మినేని ప్రచారం చేసుకుంటున్నారు. అన్నీ అనుకూలంగా జరిగితే ఈ నెల 16న ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వేదికగా జగన్ ప్రకటించే జాబితాలో తమ్మినేని పేరు ఉంటుందని భావిస్తున్నారు. ఈ సమయంలో ఇంటర్నల్ ప్రత్యర్థులు కొత్త క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు.

ఇందులో భాగంగా… ఈసారి తమ్మినేనికి కాకుండా యువతకు ఛాన్స్ ఇవ్వాలని మెసేజ్ లుపెడుతున్నారు. ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతున్న నేపథ్యంలో.. అధిష్టాణం ఎంటరైంది. దీంతో… చింతాడ రవికుమార్ కాస్త సైలంట్ అయినా… మాజీ ఎంపీపీ గాంధీ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఈ సమయంలో సీఎం క్య్యాంప్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో టిక్కెట్ తమకే అంటే తమకే అంటూ తమ్మినేని, సువ్వారి వర్గాలు నియోజకవర్గంలో ప్రకటించుకుని తిరుగుతూ హల్ చల్ చేస్తున్నాయి!! ఈ సమయంలో ఒకవేళ టిక్కెట్ దక్కకపోతే ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా గాంధీ ఆలోచిస్తున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. దీంతో ఆముదాలవలస వైసీపీలో కొత్త టెన్షన్ మొదలైందని చెబుతున్నారు. మరి 16వ తేదీ అభ్యర్థుల ప్రకటన అనంతరం ఆముదాలవలసలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయనేది వేచి చూడాలి!