ఒకప్పుడు వితౌట్ గ్యాప్ అన్నట్లుగా పవన్ పై వైసీపీ నేతలు విమర్శలు చేసేవారు. ఈ క్రమంలో ప్రత్యేకంగా పేర్ని నాని, అంబటి రాంబాబు, అమర్నాథ్ మొదలైన నేతలు ఒక పద్దతి ప్రకారం పవన్ పై విమర్శలు గుప్పించేవారు. ఈ నేపథ్యంలో సామర్ల కోట సభలో పవన్ పెళ్లిల్లు, ఇల్లాల్లపై జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పవన్ గురించి ప్రస్థావన ఏపీ రాజకీయాల్లో చాలా తగ్గిపోయిందనే మాటలు వినిపిస్తున్నాయి.
అవును… పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతల విమర్శలు అత్యంత సహజం అని అంటుంటారు. పైగా తనదైన లాజిక్కులతో ఆ విమర్శలకు తాను పూర్తి అర్హుడిని అనే అవకాశం కూడా పవన్ కల్పిస్తారని అంటుంటారు. ఈ నేపథ్యంలో… ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు ఆరోగ్య సమస్యలే పొలిటికల్ హాట్ టాపిక్ గా ఉన్నాయి. దీంతో పవన్ విషయాన్ని సైడ్ చేసింది మీడియా!
ఈ నేపథ్యంలో… సడన్ గా పవన్ ని టార్గెట్ చేశారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఇందులో భాగంగా పవన్ ని మరీ పూచికపుల్లలా తీసిపారేసినంత పనిచేశారు. పవన్ కు అంత పవనం లేదని ఎద్దేవా చేశారు. ఆయన చమడాలన్నీ ఆల్రడీ ఊడిపోయాయని తమ్మినేని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అనంతరం… చంద్రబాబు ఏమైనా.. మహాత్మా గాంధీనా, నెహ్రూ నా.. అని ప్రశ్నించిన సీతారాం… బాబు ఓ ఆర్థిక నేరగాడని ఎద్దేవా చేశారు. ఫలితంగా… టీడీపీ పని క్లోజ్ అయిపోయిందని చెప్పారు తమ్మినేని. జగన్ ని కూడా 16 నెలలు జైలులో పెట్టారని, కానీ ఏమీ నిరూపించలేకపోయారని తెలిపారు. ఇక చంద్రబాబు లోపల ఉన్నా, బయట ఉన్నా ఒక్కటేనన్న ఆయన.. జైలులో సదుపాయాలపై కోర్టు ద్వారా వారు ఏమి కోరుతున్నారో అవన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు.
ఇదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ వాళ్లు ఇన్ని చేస్తున్నా సామాన్య ప్రజలలో ఎలాంటి రెస్పాన్స్ లేదని తెలిపిన తమ్మినేని.. ఆర్థిక నేరగాళ్లకు ప్రజలు సపోర్ట్ చేయరని అన్నారు. ఇక టీడీపీ, జనసేన, బీజేపీలు ధమ్ముంటే 175 స్థానాల్లోనూ పోటీ చేయాలని సవాలు విసిరారు. ఇక ఎవరు ఎలా వచ్చినా.. పొత్తులో వచ్చినా, విడివిడిగా వచ్చినా… జగన్ అనే సింహం మాత్రం సింగిల్ గా వస్తుందని సీతారాం తెలిపారు.