కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ 4 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.
ఈ మేరకు ఆరు వారాల్లో మార్గదర్శకాలు రూపొందించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే, ఎంత మొత్తం చెల్లించాలన్నది కేంద్ర ప్రభుత్వం విజ్ఞతకే వదిలేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొనడం గమనార్హం. విపత్తు సాయం కింద మృతులకు పరిహారం అందించాలని పిటిషన్ దాఖలవగా, 4 లక్షలు చెల్లించడం సాధ్యం కాదని కేంద్రం, సుప్రీంకోర్టుకి నివేదించడం గమనార్హం. నిజానికి, కరోనా విషయమై రెండో వేవ్ సందర్భంగా రాష్ట్రాల్ని అప్రమత్తం చేయడంలో కేంద్రం పూర్తిస్థాయిలో విఫలమైందన్నది బహిరంగ రహస్యం.
అత్యవసర మందులు బ్లాక్ మార్కెట్‌కి తరలిపోవడం, ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్సకు సరైన సౌకర్యాలు లేకపోవడం, ఆక్సిజన్ సమస్యలు.. ఇలా చాలా విషయాల్లో కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన పరిస్థితి నెలకొంది. సుమారు 4 లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన దరిమిలా, అందరికీ 4 లక్షల రూపాయల మేర పరిహారం అందించాల్సి వస్తే, అది కేంద్ర ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుంది.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే.
అయితే, ఆ మొత్తం ఖచ్చితంగా బాధిత కుటుంబాలకు ఊరటనందిస్తుంది. తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలకు ఆయా రాష్ట్రాలు పది లక్షల దాకా పరిహారం అందిస్తున్నాయి. కేంద్రం కూడా ఈ విషయమై ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. అలాంటప్పుడు, కోవిడ్ వల్ల మృతి చెందిన కుటుంబాలన్నిటికీ కేంద్రం సాయం చేయాల్సి వస్తే, అది పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.