Stunning Task For Ministers : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన మంత్రి వర్గంలో ప్రస్తుతం పని చేస్తున్నవారికి ఒకేసారి చేదు, తీపి కబురు అందించారు. అంతే కాదు, చాలా పెద్ద టాస్క్ కూడా ప్రస్తుత మంత్రుల ముందుంచారు. మంత్రులుగా పదవులు దక్కించుకోబోయేవారికి కూడా అది చాలా పెద్ద టాస్క్ కాబోతోంది. ఎమ్మెల్యేల పరిస్థితీ అంతే.!
పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి లేదని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేసేశారు. మంత్రుల్ని పదవుల నుంచి తొలగించడమంటే, వారిని అవమానిస్తున్నట్లు కాదనీ, పార్టీ పరంగా మంచి మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. బాగా పని చేసి, గెలిస్తే మళ్ళీ పదవులు పొందవచ్చునని కూడా వివరించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
అంతే, పదవులు కోల్పోయే మంత్రులకు, పార్టీ పదవులు కొత్తగా వస్తాయ్.. ఆ పదవుల్లో బాగా పని చేస్తే.. వచ్చే ప్రభుత్వంలో మళ్ళీ మంత్రులుగా అవకాశం దక్కించుకోవచ్చు. ఇదొక బోనంజా అనే అనుకోవాలేమో. కొత్తగా మంత్రులయ్యేవారికీ దాదాపు ఇదే సూత్రం వర్తించొచ్చు.
ఇక, ఎమ్మెల్యేలు ఎవరైతే మరింత బాగా పని చేస్తారో వారికీ మంత్రి పదవులు దక్కుతాయనే సంకేతాలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. సో, ఇంటింటికీ వెళ్ళి తమ పని తీరుని ఎమ్మెల్యేలు మెరుగు పరచుకోవాలన్న ముఖ్యమంత్రి సూచన.. ఎమ్మెల్యేలకే కాదు, అందరికీ బాగా కలిసొచ్చేలానే వుందన్నమాట.
151 మంది ఎమ్మెల్యేలతో బంపర్ విక్టరీ కొట్టడం ఓ యెత్తు.. దాన్ని నిలబెట్టుకోవడం ఇంకో యెత్తు. ఈ విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలనానికి తెరలేపబోతున్నారా.? వేచి చూడాల్సిందే.