Ys Jagan : వై ఎస్ జగన్ స్ట్రాంగ్ వార్నింగ్: ఎమ్మెల్యేలకు మొదలైన టెన్షన్

Ys Jagan : 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి, ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్లాలనీ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేయాలనీ, సంక్షేమ పథకాల్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనీ, ప్రజల మన్ననలు పొందాలనీ స్పష్టం చేశారు.

ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతానని చెప్పిన వైసీపీ అధినేత ఆ సమీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన వారికి తిరిగి ఎమ్యెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. డోర్ టు డోర్ సంక్షేమ పథకాలు ఎలాగయితే, అందిస్తున్నామో, అదే విధంగా ఆ సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సంతృప్తిగా వున్నారా.? లేదా.? అని కూడా తెలుసుకోవాలని ఎమ్యెల్యేలకు వైఎస్ జగన్ స్పష్టమైన సూచన చేశారు.

విపక్షాలు ప్రభుత్వంపై, పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారనీ, ఎమ్యెల్యేలంతా ఈ గోబెల్స్ ప్రచారాన్నిసమర్ధవంతంగా తిప్పికొట్టాలని వాస్తవాలు ప్రజలకు తెలిసేలా, ఎమ్యెల్యేలు పని చేయాలనీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చెప్పారు. టికెట్ల ఎంపికకు పని తీరే ప్రాతిపదిక అనీ, కష్టపడి పని చేసేవారికి ఖచ్చితంగా పార్టీలో, ప్రభుత్వంలో గుర్తింపు వుంటుందని చెప్పారు.

మాటకు కట్టుబడి మంత్రి వర్గ విస్తరణలో కొత్త వారికి ఎక్కువ అవకాశాలు ఇవ్వడం జరుగుతుందని మంత్రి పదవులు పోవడమంటే అది కష్టమైన విషయంగా భావించకూడదనీ, 26 జిల్లాలకు కొత్త బాధ్యుల్నినియమించడం జరుగుతుందనీ, పార్టీని గెలిపించి తామూ గెలవాలనీ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు చెప్పారు.

వచ్చే ఎన్నికలు మరింత ప్రతిష్ఠాత్మకమైనవనీ విపక్షాల్ని అస్సలు తేలిగ్గా తీసుకోకూడదనీ, అలసత్వం వుండకూడదనీ జగన్ సూచించారు.