మెగా వ్యాక్సిన్ డ్రైవ్.. ఏ రాష్ట్రమూ ఇంతలా సాహసించలేకపోయింది. నిజానికి, ఆంధ్రపదేశ్ రాష్ట్రం కేంద్రానికి సవాల్ విసిరిందనొచ్చు.. ఒకే రోజు పదమూడున్నర లక్షల మందికి పైగా వ్యాక్సినేషన్ చేయడం ద్వారా. ఆషామాషీ వ్యవహారం కాదిది. నిజానికి, దేశవ్యాప్తంగా ఇంత వేగంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగితే తప్ప, మూడో వేవ్ నుంచి భారతదేశం బయటపడే పరిస్థితి వుండదు. కానీ, వ్యాక్సిన్లు ఎక్కడ.? నేటి నుంచి కేంద్రం, రాష్ట్రాలకు మరింతగా వ్యాక్సిన్లను అందించాల్సి వుంది.
ఎందుకంటే, అన్ని రాష్ట్రాలకు అవసరమైన వ్యాక్సిన్లను అందిస్తామనీ, 18 ఏళ్ళ పైబడినవారందరికీ వ్యాక్సిన్లు అందించాలని కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దాంతో, దేశంలోని చాలా రాష్ట్రాలు సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేయడానికి సర్వసన్నద్ధమవుతున్నాయి.
కానీ, వ్యాక్సిన్లు ఎక్కడ.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్ల సంఖ్య.. దేశం అవసరాలకు సరిపడా లేదన్నది నిర్వివాదాంశం. ఇతర దేశాల నుంచి పెద్దయెత్తున వ్యాక్సిన్లు దిగుమతి అవుతున్నాయా.? అంటే అదీ లేదు. ఆగస్టులో గానీ, పెద్దయెత్తున దేశంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. కానీ, ఆంధ్రపదేశ్ చూపిన చొరవతో కేంద్రం మీద చాలా ఒత్తిడి పెరిగింది. వివిధ రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి.. అవసరమైన మేర వ్యాక్సిన్లు అందించాలని డిమాండ్ చేస్తున్నాయి.
కేంద్రం, రాష్ట్రాల అవసరాలకు సరిపడా వ్యాక్సిన్లు ఇచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో నత్తనడకన మాత్రమే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఒక రాష్ట్రం.. ఒక రోజులో పదమూడున్నర లక్షల వ్యాక్సిన్లు వేసిందంటే.. దేశంలో అన్ని రాష్ట్రాలూ ఇదే జోరు కొనసాగిస్తే.? రెండు మూడు కోట్ల వ్యాక్సిన్లు ప్రతిరోజూ అవసరమవుతాయి.