భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ తారస్థాయికి చేరింది. గతేడాది ప్రపంచ దేశాలన్నిటినీ ఈ మహమ్మారి అతలాకుతలం చేసింది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య ఒక స్థాయికి చేరి అక్కడ నుండి క్రమక్రమంగా ఆ సంఖ్య తగ్గుతూ ప్రజలందరూ కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఒక్కసారిగా విజృభించడంతో ఎక్కడ చూసినా మరణమృదంగం వినిపిస్తుంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తికి – మన వాతావరణానికి సంబంధం ఉందా…? అనే ప్రశ్నకు చాలా అధ్యయనాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది.

ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పొడి గాలి, తక్కువ తేమలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని తమ పరిశోధనలలో కనుగొన్నారు. మైఖేల్ వార్డ్ అనే అధ్యయన పరిశోధకుడు కరోనా వైరస్ వ్యాప్తికి ‘తేమ’ ఒక ముఖ్య కారకం అని చెప్పారు. గాలిలో సాపేక్ష ఆర్ధ్రత 10 శాతం కంటే తగ్గితే వైరస్ సోకే అవకాశాలు రెండు రెట్లు పెరుగుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ప్రదేశం, సమయాన్ని బట్టి కరోనా వైరస్ వ్యాప్తిలో తేడాలు ఉంటాయని తేల్చారు. సిడ్నీలో తక్కువ తేమ శాతం ఉన్న ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరిగినట్లు గుర్తించామని అన్నారు.
తేమ తక్కువగా ఉన్న సమయంలో పొడి గాలి ఉంటుందని… తక్కువ తేమలో తుంపరలు చిన్నగా ఉండటం వల్ల తుంపరలు ఎక్కువ సమయం గాలిలో ఉండగలవని శాస్త్రవేత్తలు తేల్చారు. కరోనా రోగి దగ్గినా లేదా తుమ్మినా గాలిలో తేమ శాతం తక్కువగా ఉంటే వైరస్ ఉండే తుంపరలు ఇతరులు పీల్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. తేమ ఎక్కువగా ఉంటే తుంపరలు పెద్దవిగా ఉండి గాలిలో పడిపోతాయని చెప్పారు. భారత దేశంలో ప్రస్తుతం అలాంటి వాతావరణమే ఉండటం వల్లన వైరస్ ఈ స్థాయిలో వ్యాప్తి చెందుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాస్క్ పెట్టుకోవడం, భౌతికదూరం పాటించడం ద్వారా మాత్రమే వైరస్ వ్యాప్తిని నివారించగలం. అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకి అడుగు పెట్టవద్దు. అందరూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని మా విన్నపం.
