ఏపీ రాజకీయాలంటేనే వేరప్పా. ఏ రాష్ట్రంలో కూడా ఏపీ తరహా రాజకీయాలు ఉండవు. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగా ఉంటాయి. అది ఏ ఎన్నిక అయినా సరే.. పార్టీల హడావుడి మామూలుగా ఉండదు. ఎన్నికలకు నెల రోజుల ముందు నుంచే రచ్చ స్టార్ట్ అవుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరి పోరు నడుస్తుంది.
ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ అంటే రెండే రెండు విషయాల మీద. ఒకటి స్థానిక సంస్థల ఎన్నికలు, రెండోది తిరుపతి ఉపఎన్నిక. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా లేవు. ఆ ఎన్నికల విషయమై ఏపీ ఎన్నికల కమిషనర్ కోర్టు మెట్లు ఎక్కారు. అదో పెద్ద స్టోరీ.
ఇక.. మిగిలింది తిరుపతి ఉపఎన్నిక. ఈ ఎన్నిక ప్రస్తుతం ఏపీని షేక్ చేస్తోంది. ఇక్కడ గెలవాలని అధికార పార్టీ వైసీపీతో పాటు టీడీపీ, బీజేపీ తెగ ప్రయత్నిస్తున్నాయి.
నిజానికి ఈ గెలుపు వైసీపీ కన్నా.. టీడీపీకి, బీజేపీకి అవసరం. ఈ ఎన్నికల్లో ఆ రెండు పార్టీల్లో ఏదో ఒకటి గెలిస్తే.. వచ్చే ఎన్నికల్లో వైపీపీకి ఆ పార్టీ ప్రత్యామ్నాయం అయ్యే అవకాశం ఉంటుంది. పార్టీలోనూ ఉత్తేజం వస్తుంది.
తిరుపతిలో వైసీపీ నుంచి గెలిచిన బల్లి దుర్గా ప్రసాద్ ఇటీవల మరణించారు. ఆయన సుమారు 2.4 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ రెండో స్థానంలో వచ్చారు. టీడీపీ.. తమ అభ్యర్థిగా మళ్లీ పనబాక లక్ష్మీనే ప్రకటించారు. అందరి కంటే ముందే చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించేశారు. ఇప్పటికే టీడీపీ అక్కడ ప్రచారాలు కూడా స్టార్ట్ చేసేసింది.
అయితే.. సాధారణంగా ఎవరైనా ప్రజాప్రతినిధి చనిపోతే.. సానుభూతి ఓట్లు వస్తాయని.. ఆ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి సీటు ఇస్తారు. అదే ఆనవాయితీ తరతరాలుగా వస్తోంది. ఇటీవల తెలంగాణలోని దుబ్బాకలో జరిగిన ఉపఎన్నికలోనూ సోలిపేట భార్య సుజాతకే టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది.
సేమ్.. ఇక్కడ కూడా వైసీపీ.. బఅల్లి దుర్గా ప్రసాద్ కొడుకు చైతన్యకే ఎంపీ టికెట్ ఇస్తుందని అంతా భావించారు. కానీ.. సీన్ రివర్స్ అయింది. ఇప్పటికే టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో.. వెంటనే తేరుకున్న వైసీపీ గురుమూర్తిని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే.. సానుభూతి ఓట్లు రాకుండా జగన్.. ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నారు.. అనే విషయం తెలియకున్నా.. తాడెపల్లిలోనే తిరుపతి టికెట్ పై స్ట్రాంగ్ డిస్కషన్ జరిగిందట. అందుకే.. రిస్క్ చేసి మరీ జగన్.. వైసీపీ టికెట్ ను గురుమూర్తికి ఇచ్చారు.
అయితే.. దుర్గా ప్రసాద్ కుటుంబంలో ఒకరికి ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం మార్చిలో జరిగే ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి ఆ కుటుంబానికి ఇస్తామని ఒప్పించారట. చూడాలి మరి.. జగన్ రిస్క్ ఎంత మేరకు పనిచేస్తుందో?