ఓవైపు టీడీపీ నేతలపై వరుసగా అరెస్ట్ ల పర్వం. కీలక నేతల్ని అరెస్ట్ చేసి జైళ్లకు తరలించారు. ఇంకెంత మంది కటకటాల వెనక్కి వెళ్తారు! అన్న ఉత్కంఠ మరోవైపు. ఈ నేపథ్యంలో అధికార పక్షం-ప్రతిపక్షం మధ్య తగ్గని మాటల యుద్ధం. అటు రాయలసీమలో ఆధిపత్య పెత్తనం పోరు. ఇలా వరుస ఘటనలతో ఏపీలో రాజకీయ పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విశాఖలో టీడీపీ-వైకాపా కార్యకర్తలు ఏకంగా ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఇష్టానుసారం అసభ్య పదజాలంతో దూషించుకుని..అటుపై కొట్లాటకు దిగారు. ప్రతిగా అధికారంలో ఉన్న వైకాపా కార్యకర్తలే అమానుషంగా దాడులకు పాల్పడ్డారంటూ టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
దీంతో విశాఖలో ఉద్రిక్తత వాతావరణ పరిస్థితులు అలముకున్నాయి. అసలు ఘటన ఎందుకు జరిగింది? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. అభివృద్ది పనుల శంకు స్థాపన కోసం వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేపై వైకాపా వర్గీయులు దాడి చేసినట్లు ఆరోపించారు. విశాఖలోని అరిలోవ 13వ వార్డులో శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పై వైకాపా మద్దతు దారులు రాళ్ల దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. ఈఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారందర్నీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. దాడి నేపథ్యంలో ఎమ్మెల్యే అక్కడే భైఠాయించి నిరసనకు దిగారు.
దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. అయితే పోలీసులు వైకాపా కార్యకర్తలపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు. అయితే విశాఖ తూర్పు అభివృద్ది ఓర్వలేక వైకాపా శ్రేణులు ఇలా దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అక్కడ ఎప్పుడు టీడీపీ గెలుపు కోణంలోనే కక్ష సాధింపుగా ఇలా దాడులకు తెగబడ్డారని ఆరోపిస్తున్నారు. అయితే వైకాపా కార్యకర్తలు ముందుగా రాళ్లతో దాడి చేసింది తేదాపా కార్యకర్తలేనని చెబుతున్నారు. మరి తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ దాడి ఎంతకు దారి తీస్తుందో.