కరోనా వైరస్ మహమ్మారి పీడ ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. అప్పుడే కొత్త వైరస్ స్ట్రెయిన్ ప్రపంచం పై విరుచుకుపడటానికి సిద్ధంగా ఉంది. బ్రిటన్ లో బయటపడ్డ కరోనా వైరస్ లోని కొత్త రకం వైరస్ నిదానంగా విదేశాలకు కూడా విస్తరిస్తోంది. తాజాగా ఇది ఫ్రాన్స్ లోనూ కనిపించింది. బ్రిటన్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిలో ఈ కొత్త స్ట్రెయిన్ ను అక్కడి వైద్య నిపుణులు గుర్తించారు.
ఈ నెల 19న బాధితుడు బ్రిటన్ నుంచి రాగా, 21న నిర్వహించిన పరీక్షల్లో అతడికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అతడిని ఐసోలేషన్లో ఉంచి తదుపరి నిర్వహించిన పరీక్షల్లో అతడికి సోకింది కొత్త రకం వైరస్సేనని తేలింది. దీంతో అతడిని కలిసిన వారిని గుర్తించేందుకు అధికారులు రంగంలోకి దిగారు.
బ్రిటన్లో కొత్త స్ట్రెయిన్ వెలుగుచూసిన వెంటనే బ్రిటన్ నుంచి రాకపోకలు సాగించే విమానాలపై ఫ్రాన్స్ నిషేధం విధించింది. అయితే, ఆ దేశంలోని తమ పౌరులు మాత్రం వెనక్కి వచ్చేందుకు అనుమతిచ్చింది. ఇలా వచ్చిన ప్రయాణికుడిలోనే ఇప్పుడు ఈ వైరస్ వెలుగు చూసింది. ఇక భారత్ లో కూడా ఈ వైరస్ మూలాలు ఉన్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. కానీ, కచ్చితంగా వచ్చింది అని మాత్రం చెప్పడం లేదు. కానీ, దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా గత నెల రోజుల వ్యవధిలో బ్రిటన్ నుండి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేయడానికి సిద్ధమైంది.