లంకా దహనం.! భారతదేశానికీ ఓ హెచ్చరిక

పెట్రోల్ ధర 100 రూపాయలు దాటెయ్యడమేంటి.? వంట గ్యాస్ వెయ్యి రూపాయలు దాటెయ్యడమేంటి.? ఈ పెరుగుదల ఎప్పటిదాకా.? దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర సమాధానం లేదు. దేశం, రాష్ట్రాలూ పోటీ పడి అప్పులు చేస్తున్నాయ్. స్టీల్ ప్లాంట్ లాంటి సంస్థల్ని అమ్మేస్తున్నారు. ప్రభుత్వ భూముల అమ్మకం సంగతి సరే సరి.!

వున్న సంపదని విక్రయించేయడం తప్ప, కొత్తగా సంపద సృష్టి అనేది దేశంలో జరగడంలేదు. అప్పు చేసి చిప్పకూడు.. అన్న చందాన, సంక్షేమం పేరుతో దేశాన్ని రాజకీయ పార్టీలు ముంచేస్తున్నాయన్నది నిర్వివాదాంశం. కష్టపడి సంపాదించినవాడికి దేశంలో విలువ లేకుండా పోతోందన్న అసహనం సోషల్ మీడియా వేదికగా నెటిజనం నుంచి వ్యక్తమవుతోంది.

ఏ పనీ చేయకుండా ఖాళీగా కూర్చుంటే సంక్షేమ పథకాలు వచ్చేస్తాయ్.. కష్టపడి ఉద్యోగం చేసుకుంటే మాత్రం, పన్నులు కట్టాల్సి వస్తోందన్నది సగటు భారతీయుడి ఆవేదనగా కనిపిస్తోంది. శ్రీలంకలో ప్రభుత్వంపైకి ప్రజలు తిరగబడ్డారు. అలాంటి పరిస్థితి భారతదేశంలో రాబోతోందా.? అంటే, సోషల్ మీడియాలో కనిపిస్తున్న పోస్టులు చూస్తే, ‘ఔను’ అనిపించకమానదు.

మరీ ముఖ్యంగా, దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక, పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. పాకిస్తాన్, చైనా పేర్లను ప్రస్తావిస్తూ, సెంటిమెంట్లు రగల్చడం, వీలు చిక్కినప్పుడల్లా ‘మతం’ కోణాన్ని తెరపైకి తెస్తుండడం ద్వారా పాలకులు, ప్రజాగ్రహానికి విలువ లేకుండా చేస్తున్నారు. కానీ, ప్రజాగ్రహం పెల్లుబికి శ్రీలంకలా పరిస్థితులు మారితే.? ఆ దుస్థితి దేశానికి రాకూడదనే ఆశిద్దాం.