ఏపీలో దేవాలయాలపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశంలోనే ఎంతో ప్రతిష్ఠాత్మకమైన, పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఉన్నది ఏపీలోనే. అలాగే పలు ప్రముఖమైన ఆలయాలు కూడా ఏపీలో ఉన్నాయి. ఈనేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం అప్రమత్తమవుతున్నది.
ఇప్పటికే అంతర్వేది ఆలయ రథం అగ్నికి ఆహుతి అవడం.. మరోవైపు శ్రీకాళహస్తి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు శివలింగం, నంది విగ్రహాలను ప్రతిష్టించడం అంతా చూస్తుంటే ఏపీలో దేవాలయాలకు రక్షణ కరువైనట్టుగా అనిపిస్తోంది.
ఈనేపథ్యంలోనే వెంటనే ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇక నుంచి దేవాలయాల మీద ఎలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటోంది. వెంటనే ప్రముఖమైన ఆలయాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఆలయాల్లో భద్రతను పెంచడంతో పాటుగా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తోంది. దానికోసం ఆలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది.
ఇప్పటికే ప్రముఖమైన ఆలయాల ఈవోలతో పోలీసులు ఉన్నతాధికారులు సమావేశమై తగు సూచనలు కూడా ఇచ్చారు. మరోవైపు ద్వారకా తిరుమలలో ఉన్న ఆలయ రథానికి ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. దానికి ఇన్సురెన్స్ కూడా చేయించారు.
రాష్ట్రంలోని మిగితా ఆలయాల్లో ఉన్న రథాలకు కూడా భద్రత పెంచారు. ప్రముఖమైన ఆలయాలు, రద్దీ ఎక్కువగా ఉండే ఆలయాల వద్ద పోలీసులు నిఘాను పెంచడంతో పాటుగా భద్రతా సిబ్బందిని పెంచారు. కొన్ని ఆలయాల వద్ద ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు. కొన్ని రథాలను అందరికీ అందుబాటులో ఉంచకుండా.. ప్రత్యేకంగా నిర్మించిన రథశాలల్లో భద్రపరిచి తాళాలు వేస్తున్నారు.
ఇక.. అంతర్వేది ఆలయ రథం దగ్ధం కేసుకు సంబంధించి విచారణ ప్రస్తుతం సీబీఐ చేతుల్లో ఉంది. సీబీఐ విచారణలో అసలు నేరస్తులు ఎవరో త్వరలో తేలనుంది. అయితే.. ఒకటి రెండు సంఘటనలు జరగగానే.. వెంటనే అప్రమత్తమై రాష్ట్రంలోని ఇతర ఆలయాల్లో కూడా భద్రత, నిఘాను పెంచిన సీఎం జగన్ ను హిందువులు మెచ్చుకుంటున్నారు.