YCP Joins With Congress : ప్రత్యేక హోదా ‘వంక’ పెట్టి కాంగ్రెస్‌తో పొత్తుకి వైసీపీ సిద్ధమే.!

YCP Joins With Congress : మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ కొంప ముంచేలా వున్నారు. లేకపోతే, ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీతో కలిసి వెళతామని వ్యాఖ్యలు చేయడమేంటి.? ఇది వైసీపీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ. వాస్తవానికి పేర్ని నాని ఏది మాట్లాడినా ఆచి తూచి వ్యవహరిస్తారు.

పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసే క్రమంలో, చిరంజీవి మీద వల్లమాలిన అభిమానాన్ని కురిపించేసేవారు పేర్ని నాని, తాను మంత్రిగా వున్న సమయంలో. ఇప్పుడూ అదే పరిస్థితి.

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా వైసీపీలో మెజార్టీ నేతలకు కాంగ్రెస్‌తో పాత పరిచయాలున్నాయి. వైసీపీ అధినేత, వైసీపీ గౌరవాధ్యక్షురాలు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ నేతలే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కరడుగట్టిన కాంగ్రెస్ వాది. ఎలా చూసుకున్నా, కాంగ్రెస్ పార్టీ మీద వైసీపీకి సానుభూతి కాస్తో  కూస్తో వుండేందుకు అవకాశాలు ఎక్కువే.

కానీ, యువ నాయకత్వం మాత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జైలుకు పంపింది కాంగ్రెస్ పార్టీయేనన్న భావనతో వుంది. ఆ యువ నాయకత్వం మాత్రమే వైసీపీ – కాంగ్రెస్ పొత్తుకి కాస్త అడ్డంకిగా మారే అవకాశముంది. సరే, రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పుడెలా మారిపోతాయో చెప్పలేం.

ఇంకా ఎన్నికలకు రెండేళ్ళ సమయం వుండగా, ‘ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీతో కలిసి వెళతాం..’ అని ఇప్పుడు వైసీపీ ప్రకటించడమేంటి.? మొన్న విజయసాయిరెడ్డి చెప్పినా, ఇప్పుడు పేర్ని నాని చెప్పినా.. ఇవన్నీ వైసీపీ స్థాయిని దిగజార్చేసే మాటలే.

అధినాయకత్వం ఈ నాయకులకు కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయమై సానుకూలంగా మాట్లాడాలని సంకేతాల పంపిందా.? లేదంటే, ఆయా వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాల్ని పార్టీ అభిప్రాయాలుగా జనం మీద రుద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాలా.?