ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హిందువా, క్రిస్టియానా అనేది పక్కనపెడితే ఆయనకు దైవ భక్తి ఎక్కువ. వీలు చిక్కినప్పుడల్లా దైవ దర్శనాలకు వెళుతుంటారు. ఏ పని మొదలుపెట్టాలనుకున్నా దైవ ప్రార్థన తప్పనిసరి. అలాంటి భక్తిభావం ఉన్న వ్యక్తి శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వరస్వతిని నమ్మడంలో పెద్ద వింతేమీ లేదు. కొన్నేళ్ల క్రితమే జగన్ స్వరూపానందేంద్ర స్వరస్వతిని కలిశారు. అప్పటి నుండి స్వామీజీ పట్ల జగన్ కు మంచి నమ్మకం ఏర్పడింది. గత ఎన్నికల సమయంలో స్వామీజీ జగన్ కు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చారు. ఏ ముఖ్యమైన కార్యం తలపెట్టినా ముందుగా జగన్ స్వామీజీని కలిసి ఆశీస్సులు, సలహాలు తీసుకునేవారు. జగన్ చేసిన చాలా పనులకు ముహుర్తాలు పెట్టింది స్వామీజీయే అంటుంటారు.
జగన్ సీఎం కుర్చీ ఎక్కడంలో స్వామివారి హస్తం చాలానే ఉందని వైసీపీ నేతలు చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఆయనంటే జగన్ కు అపారమైన భక్తి, గౌరవం. ఇక తాజాగా ఏపీలోని పలు దేవాలయాల్లో స్వరూపానందేంద్ర పుట్టినరోజు వేడుకలు జరగాలని ప్రభుత్వం ఆదేశించింది. స్వామీజీ పేరు మీద ప్రత్యేక పూజలు, ఆలయ మర్యాదలు జరగాలని నిర్ణయం చేశారు. దీన్నే విపక్షాలు తప్పుబడుతున్నాయి. ప్రభుత్వానికి సంబంధంలేని ఒక పీఠాధిపతికి ఆలయాలలో మర్యాదలు, పూజలు జరగడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం తమ చర్యను సమర్థించుకుంటోంది. కేసీర తరహాలో వంద ఎకరాలు రాసివ్వలేదు కదా. గతా ప్రభుత్వంలో కూడ ఇలాంటివి జరిగాయి అంటూ ఎదురువాదనకు దిగుతోంది.
ఇందుకు కారణం జగన్ గట్టిగా డిసైడ్ కావడమేనట. ప్రస్తుతం జగన్ సర్కార్ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. జగన్ తలపెట్టిన పెద్ద పెద్ద పనులేవీ జరగట్లేదు. ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ మూడు రాజధానుల విషయంలో కోర్టు స్టే ఇచ్చింది. న్యాయవ్యవస్థ మీదే జగన్ యుద్దానికి పూనుకున్నారు. ఇంకోవైపు పార్టీలో అంతర్గత కలహాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కేంద్రం నుండి సరైన సహకారం లేదు. అభివృద్ధిలో అడుగులు అంతంత మాత్రంగానే పడుతున్నాయి. ఈ కష్టాల నుండి గట్టెక్కడానికి ఆయన స్వామివారి ఆశీస్సులు కోరుకుంటున్నారట. అందుకే ఈ ప్రత్యేక పూజలని, ఇవి ఫలిస్తే ఇంకొన్ని నెలలో ఈ కష్టాలన్నీ మాయమై తనకు తిరుగుండదని జగన్ నమ్ముతున్నట్టు చెప్పుకుంటున్నాయి రాజకీయవర్గాలు.