రాజకీయాల్లో పొత్తులు అనేవి చాలా సహజం. ఈ పొత్తుల రాజకీయాలు కొన్నిసార్లు ప్రజా ప్రయోజనం కొరకు, చాలాసార్లు అధికారం కోసం, పక్కనున్న పార్టీని తొక్కేయడానికి రాజకీయ నాయకులు పొత్తులు పెట్టుకుంటారు. అయితే ఇప్పుడు తెలంగాణలో రానున్న రోజుల్లో పొత్తుల రాజకీయం జోరుగా సాగనుంది. ఎందుకంటే తెలంగాణలో టీఆర్ఎస్ కు పోటీగా సరైన పార్టీ లేదు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉన్నప్పటికీ ప్రజలు కాంగ్రెస్ నాయకులను పట్టించుకోవడం లేదు. కాబట్టి తెలంగాణలో ఎదగడానికి బీజేపీ నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఎదో ఒకరోజు తెలంగాణలో కూడా బీజేపీ జెండా ఎగరనుందా అనే అనుమానం కలుగుతుంది. అయితే ఇప్పుడు బీజేపీ నాయకుల కల నెరవేరకపోవచ్చు కానీ ఇలాగే కష్టపడితే రానున్న రోజుల్లో ప్రజల్లో బీజేపీకి అనుకూల పవనాలు విస్తాయి.
టీడీపీతో పొత్తుకు సిద్ధమవుతున్న బీజేపీ
బీజేపీ నాయకుల వ్యూహాలు ఎవ్వరికి అర్ధం కావు. ఎందుకంటే ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి అక్కడి బీజేపీ నాయకులు అస్సలు ఇష్టపడటం లేదు. కానీ తెలంగాణలో మాత్రం బీజేపీ నాయకులు టీడీపీతో పొత్తుపెట్టుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు టీడీపీకి తెలంగాణలో కూడా చాలా క్యాడర్ ఉండేది కాబట్టి ఇప్పుడు ఆ నాయకులను తమ పార్టీ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే ఏపీలో జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ ఇప్పుడు తెలంగాణలో కూడా పొత్తుపెట్టుకోవడానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సంజయ్ కలిశారు.
బీజేపీకి సొంతంగా వెళ్లే ధైర్యం లేదా!
బీజేపీ నాయకులు చేసే వ్యాఖ్యలకు, చేసే పనులకు అసలు సంబంధం ఉండదు. తమ పార్టీపై ప్రజలకు నమ్మకం ఉందని చెప్తూనే పొత్తులకు సిద్ధపడుతున్నారు. ప్రజల్లో తమకు అంత ఆదరణ ఉండే ఎన్నికలకు ఒంటరిగా వెళ్లకుండా ఎందుకు పొత్తుల వైపు చూస్తుందని టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం బీజేపీకి ప్రజల్లో మద్దతు లేదు కానీ ఈ పొత్తుల వ్యూహం వల్ల బీజేపీకి రాష్ట్రంలో కలిసొస్తుందేమో చూడాలి.