Crime News: ఈ కాలంలో డబ్బుకు ఉన్న విలువ బంధాలు, బంధుత్వాలకు లేకుండా పోయింది. డబ్బు, ఆస్తి కోసం ఎంతటి దారుణానికి వెనుకాడటం లేదు. ఆస్తి తగాదాల వల్ల తల్లిదండ్రులు, సోదరి, సోదరులు అనే భేదం లేకుండా వారి మీద దాడి చేయడానికి, చంపడానికి కూడా వెనకాడటం లేదు కొంతమంది కసాయి వ్యక్తులు. ఇలాంటి సంఘటనే తెలంగాణలో సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఆస్తి అమ్మగా వచ్చిన మొత్తం డబ్బును తనకే ఇవ్వాలని ఒక కర్కశ కొడుకు తల్లి , తండ్రి మీద దాడి చేశాడు. దాడిలో గాయపడిన తల్లితండ్రులు ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
వివరాల్లోకి వెళితే… తెలంగాణ లోని సిద్దిపేట జిల్లా దౌల్లాబాద్ మండలం గోవిందపూర్ లో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గోవిందా పూర్ లో నివాసముండే 65 సంవత్సరాల వయస్సు గల మైసయ్య, 60 సంవత్సరాల వయసు గల పోషవ్వ కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరందరికీ వివాహాలు అయ్యాయి. వారి పెద్ద కుమారుడు అదే గ్రామంలో వేరుగా ఉండగా..చిన్న కొడుకు గతంలో జరిగిన ఒక ప్రమాదంలో మరణించాడు.
ఇటీవల తండ్రి మైసయ్య తనకున్న మూడు గుంటల భూమిని రెండు లక్షల రూపాయలకు విక్రయించాడు. రెండు లక్షల లో కొడుకు బాలమల్లు ఒక లక్ష రూపాయలు ఇచ్చి, మిగిలిన లక్ష రూపాయలు తమ కర్చుల కోసం తన వద్ద ఉంచుకున్నాడు.
ఈ క్రమంలో బాలమల్లు ఆదివారం ఉదయం తల్లిదండ్రుల వద్దకు వచ్చి డబ్బు అడగగా తమ ఆస్పత్రి ఖర్చులకోసం వాటిని వాడుకుంటామని చెప్పినా వినకుండా, తల్లిని తీవ్రంగా కొట్టి తన వద్ద ఉన్న డబ్బుల సంచిని లాక్కున్నాడు. అడ్డుగా వచ్చిన తన తండ్రి కూడా కర్రతో కొట్టాడు .తర్వాత బైక్ లో తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ ని తల్లి మీద పోసి నిప్పంటించాడు. మంటల్లో చిక్కుకున్న పోశవ్వ కేకలు వేయడంతో లోపల ఉన్న మైసయ్య పరుగున వచ్చి మంతలు ఆర్పడానికి ప్రయత్నించాడు. గ్రామస్తులు 108 వాహనానికి ఫోన్ చేసి క్షతగాత్రులు ఇద్దరిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోశవ్వ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మైసయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.