AP: వైసీపీ నేత ప్రసన్నకుమార్ ఇంటిపై జరిగిన దాడిని వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ప్రశాంతి రెడ్డి అనుచరులు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ ఇంటిపై తీవ్రంగా దాడి చేస్తూ విలువైన వస్తువులు కార్లు ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఒక్కసారిగా టిడిపి వర్గీయులు దాడికి పాల్పడటంతో కుటుంబ సభ్యులు ఎంతో భయాందోళనలకు గురి అయ్యారు.. పక్కా పథకం ప్రకారమే ప్రసన్నకుమార్ ఇంటిపై దాడి చేశారని తెలుస్తోంది.
ఇక ప్రసన్నకుమార్ ఇటీవల ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకున్న ఆమె అనుచరులు దాడికి పాల్పడినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు పాలన మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, పన్నెండు దాడుల రూపంలో సాగుతోందని విమర్శించారు.ప్రసన్నకుమార్‌రెడ్డిపై హత్యాప్రయత్నమే లక్ష్యంగా ఆయన ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. వయోవృద్ధురాలైన ఆయన తల్లిని భయభ్రాంతులకు గురిచేస్తూ టీడీపీకి చెందిన రౌడీలు చేసిన బీభత్సం, విధ్వంసం, ప్రజాస్వామ్యంపై చేసిన ఒక భయంకరమైన దాడి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిపై ఇలా పథకం ప్రకారమే దాడి చేశారంటూ జగన్ తెలిపారు.తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ నాయకుడును లక్ష్యంగా ఇలాంటి దాడి చేయడాన్ని గతంలో ఎప్పుడూ ఎక్కడా చూసి ఉండమని అభిప్రాయపడ్డారు. నేడు జగన్ మామిడి రైతులను పరామర్శించడం కోసం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటన వెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం ప్రజల దృష్టిలో పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం వివాదాన్ని సృష్టించారని ఆరోపించారు. దాన్ని అడ్డం పెట్టుకుని ఈ భయంకరమైన దాడికి పాల్పడి, దానిమీదే రాష్ట్రం అంతా మాట్లాడుకునేలా చేయాలని, ప్రజా సమస్యలేవీ బయటకు రాకూడదంటూ చేసిన కుట్ర అంటూ మండిపడ్డారు.
