దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును నిర్దేశించే కీలక ఘట్టానికి భారత్ సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 1, 2026న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్–2026ను ప్రవేశపెట్టనున్నారు. విశేషమేంటంటే, చరిత్రలో తొలిసారిగా ఆదివారం రోజున బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతోంది. దీంతో దేశవ్యాప్తంగా సామాన్యులు మొదలుకొని పారిశ్రామిక వర్గాలు, పెట్టుబడిదారుల వరకు అందరి చూపు ఈ బడ్జెట్‌పైనే నిలిచింది.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం కూడా ఈసారి అంచనాలు పెరగడానికి కారణమైంది. ‘వికసిత భారత్’ లక్ష్యంగా రూపొందుతున్న ఈ బడ్జెట్‌లో ఆర్థిక వృద్ధితో పాటు ఉపాధి కల్పన, సామాజిక సమానత్వం, దీర్ఘకాలిక స్థిరత్వంపై ప్రత్యేక దృష్టి పెట్టనుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయంగా కొనసాగుతున్న యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఒడిదుడుకుల మధ్య దేశీయ ఆర్థిక వ్యవస్థను కాపాడే బాధ్యత ఈ బడ్జెట్‌పై పడింది.
ప్రస్తుత అంచనాల ప్రకారం, భారత GDP వృద్ధిరేటు 7 నుంచి 8 శాతం మధ్య ఉండొచ్చని అంచనా. అదే సమయంలో ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణలో భాగంగా ఫిస్కల్ లోటును 4.5 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి క్యాపెక్స్‌ను భారీగా పెంచే అవకాశముంది. రహదారులు, రైల్వేలు, పోర్టులు, పట్టణ మౌలిక వసతులపై పెట్టుబడులు పెరగడం ద్వారా ఆర్థిక చక్రం వేగవంతం కానుంది.
అయితే సామాన్య ప్రజలను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తున్న అంశం ఇంధన ధరలే. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై పన్నులు పెరుగుతాయా? లేక తగ్గుతాయా? అన్న సందేహాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర VAT కారణంగా పన్ను భారం భారీగా ఉంది. ఈ నేపథ్యంలో వీటిని GST పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. ఒకవేళ GST 5 శాతం స్లాబ్‌లో చేర్చితే ఇంధన ధరలు గణనీయంగా తగ్గే అవకాశముంది.
ఇదే సమయంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయంపై ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. అందుకే నేరుగా పన్నులు పెంచడం కన్నా, పన్నుల నిర్మాణంలో మార్పులు, సర్దుబాట్లు చేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. LPG ధరల భారం తగ్గించేందుకు అండర్-రికవరీలకుగాను భారీ పరిహారం ప్రకటించే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది మధ్యతరగతి, పేద కుటుంబాలకు నేరుగా ఊరటనిచ్చే చర్యగా భావిస్తున్నారు.
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని శుద్ధ ఇంధన రంగానికీ బడ్జెట్‌లో ప్రాధాన్యం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. గ్రీన్ హైడ్రోజన్, సౌర, పవన శక్తి రంగాలకు అదనపు ప్రోత్సాహకాలు, సబ్సిడీలు పెరిగే అవకాశముంది. అలాగే దేశీయ చమురు అన్వేషణ, ఉత్పత్తిని పెంచే దిశగా కొత్త ప్రాజెక్టులకు పన్ను రాయితీలు ప్రకటించే సూచనలూ ఉన్నాయి. మొత్తం మీద బడ్జెట్–2026 కేవలం అంకెల గణితం కాకుండా, సామాన్యుడి జీవన వ్యయాన్ని తగ్గించే దిశగా కీలక మలుపుగా మారుతుందా అనే ఆసక్తి దేశమంతా నెలకొంది.
