ఏపీలో జరిగిన ఆలయాలపై దాడులు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాల వెనుక టీడీపీ, బీజేపీ శ్రేణులు ఉన్నారంటూ ఏపి డీజీపీ గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. డీజీపీ చేసిన వ్యాఖ్యలపై ఏపి బీజెపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో ఆదివారం జరిగిన బీజెపీ కోర్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ … హింధూమనోభావాలను దెబ్బతీసే విధంగా డీజీపీ స్థాయిలో ఉన్న అధికారి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తక్షణం సీఎం జగన్ గౌతమ్ సవాంగ్ ను ఆ పదవి నుండి తప్పించాలంటూ సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
ఆలయాలపై దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేయకుండా బేస్ లెస్ ఎలిగేషన్స్ తో బీజేపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామతీర్థం ఆలయ సందర్శనకు ఇతర పార్టీ నేతలకు అనుమతులు ఇచ్చి బీజెపీ నాయకులకు ఎందుకు అనుమతులు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం హింధూ దేవాలయాల ఆస్తుల వివరాలను సేకరించినట్లుగానే చర్చిలు, మిషనరీ సంస్థలకు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో కూడా లెక్కలు తీయాలని డిమాండ్ చేశారు.
క్రైస్తవమతంలో ఉన్న వారు కూడా రిజర్వేషన్ లు పొెందుతుండటం వల్ల అసలైన హింధూ దళితులకు అన్యాయం జరుగుతోందని దీనిపై సరైన లెక్కలు తేల్చాలన్నారు. మతం మార్చుకుని కూడా కొందరు రిజర్వేషన్ తో ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ వ్యవహారాలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇతర పెద్దలకు నివేదక అందజేస్తామన్నారు. దళిత క్రిస్టియన్ అనేది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఎప్పుడో ధ్వంసమైన విగ్రహాలకు సంబంధించి ఇప్పుడు బీజెపీ శ్రేణులపై కేసులు పెడుతున్నారని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.