సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసుకుంటున్న వైసీపీ నేతలు

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ అంతర్గత కుమ్ములాటలు రసవత్తరంగా మారాయి. తాడికొండ నియోజవర్గంలో పట్టుకోసం సోషల్ మీడియా లో పెడుతున్న పోస్టింగ్ లతో రాజకీయం రక్తికడుతోంది. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మధ్య వైరం ఎట్టేకలకు సద్దుమణిగిందని భావిస్తున్న తరుణంలో మరో నేత ఎంట్రీ ఇంచ్చారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయిన డొక్కా మాణిక్య వరప్రసాద్‌ రూపంలో సరికొత్త సమస్యలు వస్తున్నాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాడికొండ రాజకీయాల్లో పట్టుకోసం ఉవ్విళ్లూరుతున్న ఎమ్మెల్సీ మాణిక్య వరప్రసాద్ కారణంగా కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఎమ్మెల్యే శ్రీదేవికి గతంలో ఆమెకు ముఖ్య అనుచరులుగా ఉన్న వారికి మధ్య నెల కొన్న విభేదాలపై ఆరాతీయగా ఆసక్తికర అంశాలు వెలుగు లోకి వచ్చాయట.

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ జోక్యం వల్లే వివాదాలు తెరమీదకు వస్తున్నాయని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. తదుపరి ఎన్నికల్లో తాడికొండ నుంచి తన కుమార్తెను పోటీ చేయించేందుకే డొక్క మాణిక్య వరప్రసాద్ ఇదంతా చేయిస్తున్నారని ఆరోపిస్తోంది. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై  సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగులకు సమాధానం ఇస్తూ డొక్క పేరును మధ్యలోకి లాగుతున్నారు ఎమ్మెల్యే అనుచరులు. ఆయన పేరును నేరుగా ప్రస్తావించకుండా…

 ఆయన్ని టార్గెట్‌ చేస్తూ.. తాతయ్యా అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టులతో రాజకీయం రక్తికడుతోంది. పెద్దవాడివి నీకు ఇది తగునా అంటూ సెటైరిక్ రూపంలో పోస్టులు పెడుతున్నారు. నీ వాయిస్‌ రికార్డులు కూడా మా దగ్గర ఉన్నాయ్‌ తాతయ్య అని పోస్టులు పెడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎవరి హస్తం ఉందో ప్రభుత్వ ఇంటలిజెన్స్ వద్ద సమాచారం ఉందని త్వరలోనే అన్ని వివరాలు ప్రభుత్వం ముందుకు వస్తాయని హెచ్చరిస్తూ కూడా పోస్టులు పెట్టారు. అయితే మొత్తం మీద ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ కారణంగా వైసీపీ పరువు పోతోంది. ఈ పోస్టింగ్ లతో మొత్తం మీద తాడికొండ నియోజకవర్గంలో మూడు స్థంభాల ఆట సాగుతోందని ప్రజలు హేళన చేస్తున్నారు.