రాజకీయాల్లో ఒక భౌతికశాస్త్ర సూత్రం ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. అదే న్యూటన్స్ థర్డ్ లా. ప్రతి చర్యకు సమానమైన, వ్యతిరేకమైన ప్రతి చర్య ఉండి తీరుతుంది అనే సిద్ధాంతం రాజకీయ నాయకులకు వర్తిస్తూనే ఉంటుంది. కొందరికి అది పాజిటివ్ తరహాలో ఉంటె ఇంకొందరికి మాత్రం నెగెటివ్ తరహాలో ఉంటుంది. రిజల్ట్ ఏదైనా మొదటి చర్య మీదే ఆధారపడి ఉంటుంది. సరిగ్గా ఇదే ఇప్పుడు ఎమ్మెల్యే రోజాగారి విషయంలో జరుగుతోంది. ఆమె వాగ్ధాటి ఎలాంటిదో అందరికీ తెలుసు. ఆమె విమర్శించడం మొదలుపెడితే ప్రత్యర్థులు చెవులు మూసుకోవడం తప్ప నోరు తెరవలేరు. అదే ఆమెకు వైఎపీలో మంచి గుర్తింపునిచ్చింది. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా రోజాగారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడును అవకాశం దొరికినప్పుడల్లా తన మాటలతో చీల్చి చెండాడేవారు.
ఆయన చేసే ప్రతిపనిలోనూ రోజాగారికి కనిపించినన్ని తప్పులు ఎవ్వరికీ కనబడవు. కాల్ మనీ వివాదంలో నిండు అసెంబ్లీలో చంద్రబాబు పట్టుకుని రోజాగారు అన్న మాటలు మర్చిపోగలమా. స్వతహాగా చంద్రబాబుకు పబ్లిసిటీ యావ ఎక్కువ. అందుకే తన హయాంలో సంక్షేమ పథకాలకు ఎన్ఠీఆర్ పేరు తీసేసి తన పేరు పెట్టుకున్నారు. చంద్రన్నా కానుకల పేరుతో పెద్ద హడావిడే చేశారు. దీంతో రోజాగారు అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టి పేర్లు పెట్టుకోవడానికి తన తండ్రి ఖర్జూర నాయుడు సొమ్ము ఏమైనా ఇస్తున్నారా, భవిష్యత్తులో తన పేరును తన కుటుంబసభ్యులు సైతం గుర్తుంచుకోరనే భయంతో ఇలా ప్రభుత్వ పథకాలకు తన పేర్లు పెట్టుకుంటూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఏకిపారేశారు. అప్పట్లో చాలామంది రోజాగారు మాట్లాడిన మాటల్లో లాజిక్ ఉంది కదా అని ఆమెనే సమర్థించారు.
ఆ సమర్థింపులే ఇప్పుడు విమర్శలుగా మారి ఆమెపై దాడి చేస్తున్నాయి. వైఎస్ జగన్ సైతం సంక్షేమ పథకాలకు తన పేర్లు పెట్టుకోవడంలో తక్కువేమీ కాదు. జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, జగనన్న చేదోడు, జగనన్న గోరుముద్ద ఇలా పలు పథకాలకు తన పేరే పెట్టుకున్నారు. ఇక తాజాగా బడి పిల్లలకు జగనన్న విద్యాకానున్న పేరుతో బ్యాగులు, పుస్తకాలు, బెల్టులు, బూట్లు లాంటి సరంజామా అందించారు. వాటి మీద జగనన్న విద్యాకానుక అంటూ అక్షరాలు ప్రచురించారు. వాటిని చూసిన సోషల్ మీడియా జనాలకు అప్పట్లో రోజాగారు బాబును అన్న మాటలు గుర్తొచ్చాయి. వెంటనే ఆ మాటల తాలూకు వీడియోలను వెతికి పట్టుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి ఇప్పుడేమంటారు రోజాగారు. మీ మాటలు మీ నాయకుడికి కూడా వర్తిస్తాయా అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరి వారడిగిన దాంట్లో కూడ లాజిక్ ఉంది కదా.