Tollywood Out : తెలుగు సినిమా ‘భీమ్లానాయక్’ని వద్దన్నారు.. తమిళ సినిమా ‘వాలిమై’ని తీసుకొస్తున్నారు. సిగ్గుపడాల్సిన విషయమిది. తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు జరుగుతున్న పరిణామాలపై ఆత్మవిమర్శ చేసుకోవాలి. పరిశ్రమలో నెలకొన్న విచిత్రమైన వైఖరిని సరిదిద్దేందుకు ప్రయత్నించాలి. కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.?
ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొన్నాళ్ళ క్రితం పవన్ కళ్యాణ్‌తో ‘వకీల్ సాబ్’ సినిమా తీశారు. పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘భీమ్లానాయక్’ విడుదలకు ఇప్పుడు ఆయనే అడ్డుపడ్డారనే ప్రచారం జరుగుతోంది. ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ సినిమాల కోసం ‘భీమ్లానాయక్’ని సంక్రాంతి రేసులోంచి తప్పించేశారు తెలివిగా.
కానీ, ఏమయ్యింది.? ‘ఆర్ఆర్ఆర్’ వెనక్కి వెళ్ళింది ఒమిక్రాన్ భయంతో. ‘రాధేశ్యామ్’ సినిమాపై గందరగోళం కొనసాగుతోంది. ‘భీమ్లానాయక్’ సినిమాకి అడ్డంకులు సృష్టించకుండా వుండి వుంటే, సంక్రాంతికి థియేటర్లలో ఆ సినిమా వుండేది.
ఇక, తాజాగా తమిళ సినిమా ‘వాలిమై’ తెలుగులోకి విడుదలయ్యేందుకు డేట్ ఖరారు చేసుకుంది. ఈ సంక్రాంతికి ‘రాధేశ్యామ్’ గనుక రాకపోతే, సంక్రాంతి వసూళ్ళలో మెజార్టీ భాగం ‘వాలిమై’ కొల్లగొట్టేస్తుంది. తెలంగాణలో పెరిగిన టిక్కెట్ ధరలు ‘వాలిమై’కి కలిసొస్తాయి. ఏపీలో తగ్గిన ధరల వల్ల ‘వాలిమై’ సినిమాకి పెద్దగా నష్టం వుండదు. ఎందుకంటే, అది డబ్బింగ్ సినిమా కాబట్టి.
పరిశ్రమలో అసలు పెద్దలున్నారా.? వుంటే, తెలుగు సినిమాకి ఇంత అన్యాయం జరుగుతోంటే ఎవరికీ గొంతు పెగలదేం.?