Chandrababu : చంద్రబాబు అతి తెలివి.. ముందే చేతులెత్తేసిన వైనమిదీ.!

Chandrababu :  ‘మూడు టాయిలెట్లు కట్టలేరుగానీ, మూడు రాజధానులు కడతారా.?’ అంటూ కొత్త స్లోగన్ అందుకున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు. అధికార వైసీపీ మీద బురద చల్లే క్రమంలో చంద్రబాబు, అరువు తెచ్చుకున్న నినాదాల్ని నిస్సంకోచంగా వినిపించేస్తుంటారు.

సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్ళు అలాగే జనసైనికులు వైరల్ చేస్తోన్న ‘మూడు టాయిలెట్లు కట్టలేరుగానీ, మూడు రాజధానులు కట్టేస్తారా.?’ అనే నినాదాన్ని చంద్రబాబు తాజాగా భుజానికెత్తుకున్నారు. ఇలాంటి జిమ్మిక్కులు చేయడంలో చంద్రబాబుకి సాటి ఇంకెవరూ రారనుకోండి.. అది వేరే సంగతి.

చంద్రబాబు, తాను ముఖ్యమంత్రిగా వున్న సమయంలో రాజధాని అమరావతిని ఓ మోస్తరుగా అయినా పూర్తి చేసి వుంటే, ఇప్పుడసలు మూడు రాజధానుల చర్చ వచ్చి వుండేది కాదేమో. లక్ష కోట్లతో రాజధాని.. అంటూ ప్రగల్భాలు పలికి, గ్రాఫిక్స్ రాజధానిని చూపించి, తాత్కాలిక భవనాలతో ‘మమ’ అనిపించేసిన చంద్రబాబు, రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు.

చంద్రబాబు హయాంలో కనీ వినీ ఎరుగని రీతిలో అప్పులు జరిగాయి. ఆ అప్పులకు వడ్డీలు చెల్లించాల్సిన బాధ్యత తదుపరి ప్రభుత్వంపై పడింది. దాంతో, వైఎస్ జగన్ సర్కారు కూడా మరింతగా అప్పులు చేయాల్సి వస్తోంది. వెరసి, మొత్తంగా రాష్ట్రంపై భారం అనూహ్యంగా పెరిగిపోయింది.

అసలే ఇలాంటి లెక్కలు బాగా తెలిసిన లెక్కలు మాస్టారు కదా.. అందుకే, 2024 ఎన్నికల్లో టీడీపీకి అధికారం దక్కినా, రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం అంత తేలిక కాదని ముందే చేతులెత్తేశారు టీడీపీ అధినేత. ‘రాష్ట్రాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో బాగు చేయడం అంటే అది చాలా కష్టం. కానీ, సంక్షోభాల్ని ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు.. సంపద ఎలా సృష్టించాలో మాకు తెలుసు..’ అంటూ చంద్రబాబు తాజాగా ఊక దంపుడు ప్రసంగం చేసేశారు.

అంతలా సంపద సృష్టి మీద విశేషానుభవం వుంటే, చంద్రబాబు హయాంలో అప్పులెందుకు జరిగినట్టో.?