తెలంగాణ రాష్ట్ర సమితికి షర్మిల పార్టీ కొట్టే దెబ్బ ఎలా వుంటుంది.?

Sharmila's Party To Give Huge Shock To TRS

Sharmila's Party To Give Huge Shock To TRS

తెలంగాణలో ప్రస్తుతానికి వైఎస్ షర్మిల రాజకీయం పెద్దగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని ఇబ్బంది పెట్టలేకపోతోంది. ‘అసలు షర్మిల పార్టీని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు..’ అని టీఆర్ఎస్ నేతలు లైట్ తీసుకుంటున్నారు. కానీ, తెరవెనుకాల వైఎస్ షర్మిల స్కెచ్ గట్టిగానే వేశారనీ, ఆ స్కెచ్ దెబ్బకి తెలంగాణ రాష్ట్ర సమితి ముందు ముందు విలవిల్లాడబోతోందనీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిరుద్యోగ సమస్య అనేది అత్యంత తీవ్రమైనది. అధికారంలో వున్న ఏ రాజకీయ పార్టీ అయినా, ఈ నిరుద్యోగ సమస్య దెబ్బకి కంగారు పడాల్సిందే.

షర్మిల అందుకే, నిరుద్యోగ సమస్యని హైలైట్ చేస్తున్నారు.. తద్వారా యువతలో తమ పార్టీ పట్ల సానుకూల ధోరణి ఏర్పడేలా చేయగలుగుతున్నారు. ఇంకోపక్క రైతులు సహా వివిధ వర్గాలకు చేరువయ్యేందుకు వ్యూహాల్ని సిద్ధం చేసింది షర్మిల అండ్ టీమ్. త్వరలో షర్మిల తన పార్టీ పేరుని ప్రకటించబోతున్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ.. అనే పేరు దాదాపు ఖరారైనట్లే తెలుస్తోంది. జెండా, ఎజెండా వంటి అంశాలన్నీ అతి త్వరలో వెల్లడవుతాయి. ఒక్కసారి జెండా ఖరారైతే, ఆ తర్వాత ఇంటింటికీ వెళ్ళి వైసీపీ వైపు జనాల్ని తిప్పుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు షర్మిల అండ్ టీమ్ కి. ఇక, ఈటెల రాజేందర్ ఎపిసోడ్ తర్వాత ఇష్టం లేకపోయినా, షర్మిల గురించి ఆలోచించాల్సిన అగత్యం అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి వచ్చినట్లే కనిపిస్తోంది.

తెలంగాణలో బీజేపీ జోరుని అడ్డుకోవాలన్నా, కాంగ్రెస్ ఎదగకుండా చేయాలన్నా.. తెలంగాణలో ఓ బలమైన ఓటు బ్యాంకు చేజారిపోకుండా వుండాలన్నది తెలంగాణ రాష్ట్ర సమితి ఆలోచన. ఆ ఓటు బ్యాంకు అంతా షర్మిల వైపు వెళ్ళే అవకాశం వుందన్న భయం కూడా గులాబీ పార్టీకి వుంది. అందుకే, ఆ ఓటు బ్యాంకుని పదిలం చేసుకోవడానికి అప్పుడే గులాబీ పార్టీ తెరవెనుక కసరత్తులు ముమ్మరం చేసిందట. కానీ, షర్మిల అండ్ టీమ్ మాత్రం.. ఆ ఓటు బ్యాంకుని కొల్లగొట్టి, తెలంగాణ రాష్ట్ర సమితికి షాకివ్వాలనే ఆలోచనతో వున్నట్లు తెలుస్తోంది.