షర్మిల రాజకీయ ఆశలపై నీళ్ళు చల్లిన కరోనా.?

Sharmila's Hungama diluted Due To Covid 19

Sharmila's Hungama diluted Due To Covid 19

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల, తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు గతంలోనే ప్రకటించిన విషయం విదితమే. ఈ మేరకు ఆమె ఖమ్మంలో ఓ బహిరంగ సభ నిర్వహించి, ఆ వేదిక ద్వారానే కొత్త రాజకీయ పార్టీపై ప్రకటన చేశారు. హైద్రాబాద్ నగరం నడిబొడ్డున, నిరుద్యగుల సమస్యలపై నిరసన దీక్షకు కూడా దిగారు షర్మిల. ఆ వ్యవహారం అప్పట్లో రాజకీయంగా చర్చనీయాంశమయ్యింది.

తెలంగాణ రాజకీయాల్లో చిన్నపాటి ప్రకంపనకు కూడా కారణమయ్యింది. అయితే, అనూహ్యంగా కరోనా సెకెండ్ వేవ్ రావడంతో.. ఒక్కసారిగా షర్మిల రాజకీయ ఆశలపై నీళ్ళు చల్లినట్లయ్యింది. క్రమక్రమంగా షర్మిల గురించిన చర్చ తెలంగాణ రాజకీయాల్లోంచి కనుమరుగవుతూ వస్తోంది. అయితే, షర్మిల తనవంతుగా పలు అంశాలపై సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే వున్నారు. వ్యాక్సినేషన్ వైఫల్యాలపైనా, ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సౌకర్యాలపైనా, ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీపైనా.. అన్నిటికీ మించి ఆరోగ్య శ్రీ పైనా షర్మిల నినదిస్తున్నారు. అయినాగానీ, షర్మిలను ఎవరూ పట్టించుకోవడంలేదు. అత్యంత వ్యూహాత్మకంగా ఈటెల రాజేందర్ ఎపిసోడ్ తెరపైకి రావడంతో, షర్మిల గురించి పట్టించుకునేవారే కరవయ్యారు. మరి, ఈ పరిస్థితుల్లో కొత్త రాజకీయ పార్టీ పెట్టి ఏంటి ప్రయోజనం.? అన్న కోణంలో షర్మిల పునరాలోచనలో పడ్డారనే ప్రచారం జరుగుతోంది. ‘ఆమెకి తెలంగాణతో ఏంటి సంబంధం.? చేతనైతే ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చేసుకోవాలి..’అంటూ ఇప్పటికే పలువురు గులాబీ నేతలు వ్యాఖ్యానించిన విషయం విదితమే. కాగా, తాజా రాజకీయ పరిణామాలపై షర్మిల ఎప్పటికప్పుడు అత్యంత సన్నిహితులతో చర్చలు జరుపుతూనే వున్నారు. ఆ చర్చల్లోనూ కొత్త రాజకీయ పార్టీపై షర్మిల, ఎవరికీ భరోసా ఇవ్వలేకపోతున్నారట.