వైఎస్ఆర్ అనే పేరు కాంగ్రెస్ పార్టీనే కాపాడలేదు.. ఇక షర్మిలను గట్టెక్కించగలదా ?

వైఎస్ షర్మిల ఉన్నపళంగా ఊడిపడి తెలంగాణలో పార్టీ పెడుతున్నారు.  ఇప్పుడు కొత్త పార్టీ ఎందుకు అంటే తెలంగాణలో రాజన్న రాజ్యం లేదు.  దాన్ని తీసుకురావడానికే నా పార్టీ అంటున్నారు.  అసలు రాజన్న రాజ్యం అంటే ఏమిటి.. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలా లేకపోతే ఆయ్న వారసత్వపు పాలనా అనే ప్రశ్నకు షర్మిల వద్ద జవాబు లేదు.  సంక్షేమ పథకాలే అంటే.. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలు, ఫీజు రీఎంబర్సిమెంట్ లాంటివి నడుస్తూనే ఉన్నాయి.  మరి షర్మిల కొత్తగా తీసుకొచ్చేది ఏంటి అనడుగుతున్నారు జనం.  తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు గడిచిపోయింది.  మరి ఇన్నేళ్లు ఆమెకు తెలంగాణ కానరాలేదా, ఇక్కడ రాజన్న రాజ్యం లేదనే సంగతి గుర్తుకులేదా అంటే నో ఆన్సర్. 
Sharmila Plans Not Easy In Reality   
Sharmila plans not easy in reality
 
సరే.. ఇవన్నీ పక్కనపెడితే ఏపీలో తన అన్న వైఎస్ జగన్ తండ్రి వైఎస్ఆర్ పేరు చెప్పి పొందాల్సిన ప్రతిఫలాన్ని సంపూర్ణంగా పొందారు.  అన్న తరహాలోనే తాను కూడ తెలంగాణలో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుందామనే అనుకుంటే ఏడ్సు జరగని పనే అనాలి.  వైఎస్ఆర్ ఏల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడిగానే ఉన్నారు.  ఏనాడూ పార్టీని విమర్శించలేదు, ఎదురుతిరగలేదు.  కాంగ్రెస్ హైకమాండ్ సైతం ఆయనకు ఫ్రీహ్యాండ్ ఇచ్చేసింది.  వైఎస్ సైతం ప్రతిపథకానికి ఇందిరమ్మ, రాజీవ్ గాంధీల పేర్లనే పెడుతూ వచ్చారు.  ఏపీలో అంటే ఏదో ఎమోషన్ మీద వైఎస్ఆర్ సెంటిమెంట్ వర్కవుట్ అయింది కానీ తెలంగాణలో మాత్రం వైఎస్ అంటే కాంగ్రెస్ పార్టీనే అనే భావన గట్టిగా ఉంది.  ఇద్దరూ ఒకరికొకరు అనే అంటారు.  కాబట్టి వైఎస్ సోలో హీరో అంటే నమ్మరు జనం. 
 
అలాగని ఆయనకు వ్యక్తిగత ఇమేజ్ లేదా అంటే లేదని కాదు.  ఉంది.  కానీ అది ఒక పార్టీని నిలబెట్టగలిగే స్థాయిలో ఉందా అనేదే అనుమానం.  ఆ స్థాయిలోనే   ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏనాడో ఆయన పేరు చెప్పి ఓట్లు దండుకునేది.  ఆయన ఫోటో చూసైనా జనం కాంగ్రెస్ పార్టీకి ఇంకో 10 సీట్లు ఎక్కువ ఇచ్చేవారు.  కానీ అలా జరగలేదు కదా.  అలాంటప్పుడు కొత్తగా వస్తున్న షర్మిలను అమాంతం భుజానికెత్తుకుంటారనుకోవడం కరెక్ట్ కాదు.  పైగా కేసీఆర్ ఎంత బలంగా ఉన్నారో తెలిసిందే.  ఆయన్ను ఢీకొట్టడానికి కేంద్రమే తలకిందులవుతోంది.  సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత ఇప్పుడిప్పుడే ఫలితాల్ని చూస్తోంది.  అలాంటిది  ఒంటరిగా షర్మిల కేసీఆర్ లాంటి నాయకుడిని ఢీకొట్టడం అంటే మాడు బొప్పి కడుతుంది.  ఆమె అసలు కాంగ్రెస్, బీజేపీలను అధిగమిస్తేనే తెరాస వరకు వెళ్ళగలరు.  ఇన్ని ప్రతికూలతల మధ్యన షర్మిల తండ్రి పేరు చెప్పుకునే ఎదిగేద్దాం అనుకుంటే మాత్రం నిరాశ తప్పదు. 

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles