జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా నాటి నుండి ఇప్పటివరకు హైకోర్టు కు ప్రభుత్వానికి మధ్య అసలు పొసగటం లేదు. న్యాయ వ్యవస్థతో ఏపీ ప్రభుత్వానికి వైరం బాగా ముదిరిపోతోంది. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనిలో కోర్టు జోక్యం చేసుకోవటం, దానిని తప్పు పట్టటం లాంటివి చేస్తుంది. దీని వెనుక ఒక కుట్ర కోణం ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే డైరెక్ట్ గా న్యాయ వ్యవస్థను టార్గెట్ చేయటం మంచి పద్దతి కాదని, ఇన్ డైరెక్ట్ గా విమర్శలు చేస్తున్నారు.
ఇలాంటి విమర్శలపై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే, ఇలాంటి సమయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి హైకోర్టు ఇచ్చిన తీర్పులపై దానికి సంబంధించిన న్యాయమూర్తులపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తికి లేఖ రాయటం చర్చనీయాంశం అయ్యింది. ఇందులో హైకోర్టు ఇచ్చిన తీర్పులు న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, టీడీపీకి అనుకూలంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
జస్టిస్ సత్యనారాయణ మూర్తి ప్రభుత్వంపై వ్యతిరేకతను బహిరంగంగానే వ్యక్తీకరిస్తూ వచ్చారు. పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వటమే కాకుండా, ప్రభుత్వ పథకాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
-ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టైన టీడీపీ నేత అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లకుండా ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి, ఆ ఆసుపత్రి నుంచినే బెయిల్ మీద విడుదల అయ్యేలా జస్టిస్ కే లలిత తీర్పులను ఇచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వ వాదనలను వినలేదు.
-జస్టిస్ డి.సోమయాజులు సిట్, కేబినెట్ కమిటీ ఏర్పాటులపై ప్రభుత్వ ఆదేశాలపై స్టే ఇచ్చిన న్యాయమూర్తి వీరు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేసి రిట్ పిటిషన్ల ఆధారంగా స్టే ఆర్డర్లను ఇచ్చారు.
రమేష్ హాస్పిటల్ వ్యవహారంలో 10 మంది మృతి చెందిన కేసులో రమేష్ హాస్పిటల్ ఓనర్ కు అనుకూలమైన తీర్పులను ఇచ్చాడు జస్టిస్ డీ రమేష్, ఆయన ఇచ్చిన తీర్పులను ఏకంగా సుప్రీం కోర్టు తప్పు పట్టటం జరిగింది.
ఇలా అనేక విషయాలు జగన్ రాసిన లేఖలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ లేఖలోని విషయాలు హైకోర్టు వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ తీర్పులు రావటానికి ప్రధాన కారణం జస్టిస్ రమణ కారణమని, ఆయనే టీడీపీ కి అనుకూలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చేలా ప్రభావితం చేస్తున్నాడని కూడా పేర్కొన్నట్లు తెలుస్తుంది.