ఓటమి షాక్ నుండి తేరుకుంటున్న క్రమంలో తెలుగుదేశం పార్టీకి నేతలు వరుస షాక్స్ ఇస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీ టర్న్ తీసుకోగా ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలు గోడ దూకడానికి రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి టీడీపీ పొలిట్ బ్యూరోకు రాజీనామా చేయడం సంచలనం రేపింది. వ్యక్తిగత కారాణాలతోనే ఆమె రాజీనామా చేశారని చెబుతున్నా ఈ పరిణామం వెనుక బలమైన కారణాలు ఉన్నట్టు చెబుతున్నారు.
తాజాగా పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుల నియామకంలో ఆమె అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోవడం, ఈసారి పొలిట్ బ్యూరోలో చోటు దక్కే వాతావరణం లేకపోవడంతో ఆమె రాజీనామా చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కొందరైతే ఆమె కూడ పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని, అందుకు సన్నాహకంగానే పొలిట్ బ్యూరోకు రాజీనామా చేశారని అంటున్నారు. ఇప్పటికే గత ఎన్నికల్లో చిత్తూరుజిల్లా మీద టీడీపీ పూర్తిగా పట్టు కోల్పోయిన నేపథ్యంలో అరుణ కుమారి రాజీనామా పర్వం పార్టీకి మరింత నష్టం చేకూర్చనుంది.
కాంగ్రెస్ హయాంలో గల్లా కుటుంబం చిత్తూరు జిల్లాలో కీలకంగా వ్యవహరించింది. చంద్రగిరి నియోజకవర్గం నుంచి అరుణకుమారి నాలుగు దఫాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో టీడీపీలో చేరిన ఆమె ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడలేదు. ఆమె గనుక టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లాలనే నిర్ణయం తీసుకుంటే చిత్తూరు జిల్లాలో పార్టీని కాచుకునే నేతలు కరువైనట్టే. ఇకపోతే ఆమె కుమారుడు గల్లా జయదేవ్ టీడీపీ నుండి రెండవసారి ఎంపీగా గెలిచి ప్రస్తుతం పార్టీ వ్యవహారాల్లో కీలకంగా ఉన్నారు.