భారతదేశానికి అతి పెద్ద సమస్య.. రెండో డోస్.!

Second Dose, Challenging factor for India Now

Second Dose, Challenging factor for India Now

కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే, ఇప్పుడున్న ఒకే ఒక్క మార్గం వ్యాక్సినేషన్. కానీ, దేశంలో సరిపడా వ్యాక్సిన్ తయారీ లేదు. వచ్చిన వ్యాక్సిన్లను వచ్చినట్లే రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నాయి వ్యాక్సిన్ తయారీ సంస్థలు. వాటి సామర్థ్యం పరిమితం కావడంతో, సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఆయా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. నిజానికి, ఈ పనిని ఎప్పడో ఆయా సంస్థలు చేసి వుండాల్సిందన్నది నిపుణుల వాదన. అదే సమయంలో, అదేమంత తేలికైన వ్యవహారం కాదు గనుక, ఈ విషయంలో వ్యాక్సిన్ తయారీ సంస్థల్ని తప్పు పట్టలేమన్నది మరికొందరు నిపుణులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం.

చాలా రాష్ట్రాల్లో మొదటి డోస్ వ్యాక్సిన్ రికార్డు స్థాయిలోనే వేసేశారు. ఇప్పుడేమో మొదటి డోస్ వేసుకున్నవారికి రెండో డోస్ వేయడం, అలాగే కొత్తగా వచ్చేవారికి మొదటి డోస్ వేయడం ఓ పెద్ద సమస్యగా మారింది. ముందు ముందు ఇది మరింత పెద్ద సమస్య కాబోతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, ఆంధ్రపదేశ్ అయినా.. తెలంగాణ అయినా.. రోజుకి 10 లక్షల వ్యాక్సిన్లను ప్రజలకు అందించగలిగే ఏర్పాట్లతో వున్నాయి. కానీ, ఆ స్థాయిలో వ్యాక్సిన్లు తెలుగు రాష్ట్రాలకు అందడంలేదు. ఈ విషయంలో ఎవరన్నా రికార్డుల గురించి ప్రస్తావిస్తే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి.. రికార్డు స్థాయిలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. సో, రికార్డుల గురించి ఏ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడినా, అంతకన్నా దిగజారుడుతనం ఇంకోటుండదు. వ్యాక్సిన్.. వ్యాక్సిన్.. వ్యాక్సిన్.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట. దేశంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతున్నా, మూడో వేవ్ పొంచి వున్న దరిమిలా.. అదెంత ప్రమాదకరంగా వుంటుందో చెప్పలేం. ఇప్పటికే దాదాపు దేశమంతా ‘లాక్ డౌన్’లో వుంది. పేరు మాత్రం కొన్ని చోట్ల లాక్ డౌన్.. మరికొన్ని చోట్ల కర్ఫ్యూ. ఈ పరిస్థితుల్లో కేంద్రం, ప్రత్యేక చొరవ చూపి వ్యాక్సిన్లను పెద్దయెత్తున విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నించాలి. పైగా, దేశమంతా ఒకటే వ్యాక్సిన్ పాలసీ వుండాలి. రాష్ట్రాల మధ్య తగవులు లేకుండా, అన్ని రాష్ట్రాలకూ సమానంగా కేంద్రమే, వ్యాక్సిన్లు పంపితే.. ఆ క్రెడిట్ కూడా మోడీ సర్కార్ తన ఖాతాలో వేసుకోవచ్చు. ప్రాణాలు నిలవడం ముఖ్యమిక్కడ.. రికార్డులు, క్రెడిట్ల చర్చ కాదిక్కడ కావాల్సింది.