Crime News: సింగరేణి బొగ్గుగని ప్రమాదంలో విషాదం.. ప్రమాదంలో ముగ్గురు మృతి..!

Crime News: పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి పరిధిలోని ఏపిఏ అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ (ఏఎల్పి) లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాద సమయంలో ఏడు మంది చిక్కుకుకోగా మూడు రోజుల రెస్క్యూ ఆపరేషన్ అనంతరం నలుగురు క్షేమంగా బయట పడగా, ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఏ ఎల్ పి బొగ్గుగనిలో 86వ టనల్ వద్ద రూఫ్ బోల్డ్ పనులు జరుగుతుండగా ప్రమాదం సంభవించిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో ఏరియా సేఫ్టీ ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్ సహా మరొక ఐదు మంది కార్మికులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు ని సోమవారం రక్షించగా 26 గంటలు ప్రాణాలతో పోరాడిన రవీందర్ అనే వ్యక్తిని మంగళవారం ఉదయం రెస్క్యూ టీం కాపాడగలిగింది.

రెస్క్యూ ఆపరేషన్ కి షిఫ్ట్ కి 100 మంది చొప్పున నాలుగు షిఫ్ట్లు గా విడిపోయి రెస్క్యూ ఆపరేషన్ చేసారు. ఫ్రంట్ బకెట్ లోడర్ ఆపరేటర్ జాడి వెంకటేష్, ఓవర్ మెన్ పిల్లి నరేష్, బదిలీ కార్మికుడు రవీందర్, సపోర్ట్ మేన్ ఎరుకుల వీరయ్య ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డారు. యంత్రంతో పనిచేస్తుండగా బొగ్గు పెల్ల కూలి మొత్తం ఒక్కసారిగా చీకటి అయిందని, వెంటనే తన చేతిలో ఉన్న సైరన్ మోగించడంతో తన సహచరులు కాపాడారని జాడి వెంకటేష్ తెలిపారు. రవీందర్ మాట్లాడుతూ కాళ్లు బొగ్గు పెల్లల మధ్యలో ఇరుక్కుపోయాయి అని, నడుము పై భాగంలో ఎటువంటి గాయాలు కాకపోవడంతో బయటపడ గాలిగాను అని చెప్పాడు.

ఈ ప్రమాదంలో అసిస్టెంట్ మేనేజర్ చైతన్య తేజ, సేఫ్టీ ఆఫీసర్ జయరాజ్, కార్మికుడు శ్రీకాంత్ మరణించినట్టు అధికారులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న మృతుల బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.