Tragedy: పట్టాలు తప్పిన హైస్పీడ్ రైలు.. 39 మంది మృతి.. 70 మందికి పైగా గాయాలు..!

స్పెయిన్‌లో జరిగిన ఓ ఘోర రైలు ప్రమాదం దేశాన్నే కాకుండా యూరప్ మొత్తాన్ని షాక్‌కు గురి చేసింది. అండలూసియా ప్రాంతంలోని కార్డోబా ప్రావిన్స్‌లో, ఆడముజ్ పట్టణం సమీపంలో హైస్పీడ్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో కనీసం 39 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మందికి పైగా గాయపడగా, పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

మాలాగా నుంచి మాడ్రిడ్‌కు వేగంగా దూసుకెళ్తున్న ప్రైవేట్ సంస్థ ‘ఇరియో’ హైస్పీడ్ రైలు అకస్మాత్తుగా పట్టాలు తప్పింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ రెన్ఫే రైలును అది తీవ్రంగా ఢీకొట్టింది. ఢీకొన్న క్షణంలో పెద్ద శబ్దం, ఆపై చీకటి, అరుపులు… కొన్ని క్షణాల్లోనే ప్రశాంతంగా ఉన్న రైలు ప్రయాణం భయానక దృశ్యంగా మారిపోయింది.

రాత్రి సమయం కావడం, ప్రమాదం జరిగిన ప్రాంతం చేరుకోవడం కష్టమైన భౌగోళిక స్థితిలో ఉండటంతో సహాయక చర్యలు అత్యంత క్లిష్టంగా మారాయి. బోగీలు ఇనుప చువ్వల్లా మెలికలు తిరిగి ఒకదానిపై ఒకటి పడిపోవడంతో లోపల చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీయడం కత్తిమీద సాములా మారింది. స్థానిక ప్రజలు, అగ్నిమాపక సిబ్బంది కలిసి గాయపడిన వారిని ఆరు వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు.

ఈ ప్రమాదాన్ని రవాణా మంత్రి ఆస్కార్ ప్యూయెంటే అత్యంత విచిత్రమైన, ఊహించని ఘటన గా అభివర్ణించారు. ఇటీవలే పునరుద్ధరించిన సరళ రేఖ మార్గంలో, దాదాపు కొత్తగా ఉన్న హైస్పీడ్ రైలు పట్టాలు తప్పడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు. “ఇది హారర్ సినిమా సన్నివేశంలా అనిపించింది. రైలు పూర్తిగా కూలిపోతుందేమోనని భయపడ్డాం అని కొందరు ప్రయాణికులు వణుకుతూ చెప్పారు.

రెండో రైలులో ప్రయాణించిన మాంట్సే అనే మహిళ మాట్లాడుతూ, ఒక్కసారిగా భారీ కుదుపుతో రైలు ఆగిపోయిందని, అంతా చీకటిమయమై లగేజీ గాల్లో ఎగిరిపడిందని తెలిపింది. బోగీల మధ్య ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు గంటల తరబడి శ్రమించాల్సి వచ్చిందని కార్డోబా ఫైర్ చీఫ్ ఫ్రాన్సిస్కో కార్మోనా వివరించారు. ఈ విషాదంపై స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఇది దేశానికి తీరని విషాద రాత్రి అని అన్నారు. బాధిత కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కింగ్ ఫెలిప్ VI, క్వీన్ లెటిజియా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు రాజభవనం వెల్లడించింది. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ కూడా సంఘీభావం ప్రకటించారు.

ఇరియో రైలులో సుమారు 300 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా మాడ్రిడ్–అండలూసియా మధ్య హైస్పీడ్ రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. మాడ్రిడ్, కార్డోబా, సెవిల్లే, మాలాగా నగరాల మధ్య రైలు రాకపోకలు సోమవారం వరకు రద్దు చేశారు. 2013లో శాంటియాగో డి కంపోస్టెలాలో జరిగిన ప్రమాదం తర్వాత, స్పెయిన్‌లో ఇదే అతిపెద్ద రైలు ప్రమాదంగా నమోదు కావడం గమనార్హం. ప్రమాదానికి గల అసలు కారణాలు తెలుసుకునేందుకు లోతైన దర్యాప్తు ప్రారంభమైంది.