ఇసుక తుపానులో వైఎస్ జగన్ సర్కారు.. నిజమెంత.?

Sand Shock To YSRCP Again..

Sand Shock To YSRCP Again..

మొదటి నుంచీ ‘ఇసుక’ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అస్సలు కలిసి రావడంలేదు. వరదలొచ్చాయి గనుక, ఇసుక సమస్య అన్నారు.. కొత్త ఇసుక విధానం అన్నారు.. ఇసుక సామాన్యులకు దొరక్కపోవడంతో ప్రబుత్వం మీద విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికీ ఆంధ్రపదేశ్‌లో ఇసుక సమస్య తీరడంలేదు. చిత్రమేంటంటే పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఇసుక సమస్య లేదు. ఆంధ్రపదేశ్ మాత్రమే ఇసుక సమస్యతో ఎందుకు కొట్టుమిట్టాడుతోంది.? కొత్త ఇసుక విధానాన్ని ప్రభుత్వం సరికొత్తగా తీసుకొచ్చి, పదే పదే అందులో ఎందుకు మార్పులు చేయాల్సి వస్తోంది.? ఎక్కడో ఏదో తేడా కొడుతోంది.

జగన్ ప్రభుత్వంలో బోల్డంతమంది సలహాదారులున్నారు.. ఎవరికీ అర్థం కానంత జఠిలంగా సమస్య ఎందుకు మారిపోయిందో ఏమోగానీ, జగన్ సర్కార్ మాత్రం ఇసుక తుపానుని ఎదుర్కొంటూనే వుంది. నిజానికి, ఇసుక అనేది చాలా కీలకమైన సమస్యగా మారిపోయింది రాష్ట్రంలో. అధికార పార్టీకి చెందిన నేతల ఇసుక దందా.. అనే ఆరోపణలు వైఎస్సార్ హయాంలోనూ, ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనూ, చంద్రబాబు హయాంలోనూ వినిపించాయి..ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలోనూ వినిపిస్తూనే వున్నాయి. సమస్య ఏంటి.? దానికి పరిష్కారమేంటి.? అన్నదానిపై ప్రభుత్వం ఎంత లోతుగా దృష్టిపెట్టినా, ఇసుక మీద ఆధారపడ్డ రాజకీయం, అవినీతికి దూరంగా వుండలేకపోవడం వల్లే ఈ సమస్య.. అన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిష్కరించలేనంత పెద్ద సమస్య ఏమీ కాదు. కానీ, ఎక్కడో లోపం జరుగుతోంది. తాజాగా, ఓ ప్రైవేటు సంస్థకి రాష్ట్రంలోని ఇసుక వ్యవహారాన్ని అప్పగించడం పెను రాజకీయ దుమారానికి కారణమయ్యింది. వంద కోట్లు వేల కోట్లు దోచేయబోతున్నారంటూ విపక్షాలు విమర్శించేలా అవకాశం ఎందుకు జగన్ సర్కార్ ఇసుక విషయమై ఇస్తోందట.?