బద్వేలులో కూడా అదే సీన్ రిపీట్ అయ్యిందేంటబ్బా.?

కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. పోలింగ్ ప్రశాంతంగానే ప్రారంభమయ్యింది.. వ్యవహారం సజావుగా సాగితే అది రాజకీయం ఎందుకవుతుంది.? సిట్టింగ్ ఎమ్మెల్యే అనారోగ్యంతో కన్నుమూయడంతో జరుగుతున్న ఉప ఎన్నిక ఇది. సిట్టింగ్ ఎమ్మెల్యే సతీమణి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారిక్కడ.

కాగా, వైసీపీ సిట్టింగ్ స్థానమైన బద్వేలులో తమ ఉనికిని చాటుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. రాజకీయాల్లో పోటీ చేయడాన్ని తప్పు పట్టలేం. అయితే, ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా జరుగుతున్న వ్యవహారాలే అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి.

పొరుగు జిల్లాల నుంచి దొంగ ఓటర్లను తీసుకొస్తున్నారన్నది బీజేపీ ఆరోపణ. ఈ మేరకు కొందరు దొంగ ఓటర్లు మీడియాకి అడ్డంగా దొరికిపోతున్నారు కూడా. ఇదే సీన్, తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా కనిపించింది. అయితే, అప్పట్లో అరెస్టులు జరిగాయా.? వాటిల్లో ఎంత మందికి శిక్ష పడింది.? అన్నదానిపై ఆ తర్వాత చర్చే లేదు.

అయినా, దొంగ ఓట్లు వేయడమేంటి.? బీజేపీ ఆరోపణల ప్రకారం చూస్తే, దొంగ ఓటర్లను వైసీపీ తీసుకొచ్చిందనుకోవాలి. కానీ, వైసీపీకి ఆ అవసరం వుందా.? ఛాన్సే లేదు. వైసీపీ గెలుపు ఇక్కడ నల్లేరు మీద నడక. చాలా తేలిగ్గా విజయం సాధించే అవకాశం వైసీపీకి వుంది. బరిలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా లేకపోవడం వైసీపీకి ప్లస్ పాయింట్.

ఇక, బీజేపీకి ఏజెంట్లు దొరక్క, టీడీపీ నుంచి తెచ్చుకోవాల్సి వచ్చింది. పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ ఏజెంట్లను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. మరి, దొంగ ఓటర్లు ఎలా వచ్చారు.? ఈ వ్యవహారంపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టాల్స వుంది. లేదంటే, వైసీపీ ఇమేజ్ ముందు ముందు మరింత డ్యామేజీ అయిపోతుంది.