రాజధానిగా అమరావతిని కాదని వైఎస్ జగన్ సర్కార్ మూడు రాజధానుల ప్రతిపాదనతో ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ విధానాన్ని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎట్టి పరిస్థితిలోనూ అమరావతినే పూర్తిస్థాయి రాజధానిగా ఉంచాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఏమో ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసింది. అప్పట్లో అమరావతికి శంఖుస్థాపన చేసిన మోదీ ఈరోజు అదే అమరావతి అన్యాయమైపోతుంటే ఎందుకు మాట్లాడటం లేదని, ఆంధ్రుల పట్ల వారికున్నదల్లా కపట ప్రేమని దుయ్యబడుతున్నారు. మొదట్లో మూడు రాజధానులను కేంద్రం అడ్డుకుంటుందని అందరూ భావించారు. శంఖుస్థాపన చేసింది మోదీయే కాబట్టి జగన్ కు అడ్డుపడతారని ఆశపడ్డారు.
ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ చేసే నామమాత్రపు పోరాటం జగన్ మీద ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. దీంతో అమరావతి రైతుల ఆందోళనకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక జగన్ అయితే గవర్నర్ వద్ద మూడు రాజధానుల బిల్లుకు ఆమోదముద్ర వేయించుకున్నారు. అక్కడితో ఇక కేంద్ర ప్రభుత్వం కూడ ముఖ్యమంత్రికి మద్దతుగానే ఉందని రూఢీ అయిపోయింది. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ బీజేపీ దాని మిత్రపక్షం జనసన మీద గురిపెట్టింది. మోదీని దుయ్యబడుతూనే రాష్ట్ర బీజేపీ ఎందుకు మోదీని నిలదీయడంలేదని ప్రశ్నిస్తున్నారు. కానీ వీటికి బీజేపీ నేతల వద్ద సమాధానం లేదు. ఎంతసేపూ దాటవేత ధోరణి, ప్రతివిమర్శలు తప్ప రాజధానిని కాపాడతారా లేదా అనేది మాత్రం చెప్పట్లేదు.
అలాగే ఇటీవల పవన్ కళ్యాణ్ అమరావతి వెళ్లి అక్కడి రైతులను కలిసి రాజధానికి మద్దతు తెలిపారు. కానీ మోదీని ఒక్క మాట కూడ అనలేదు. మిత్రపక్షంగా ఉంటూ కనీసం బీజేపీ స్టాండ్ ఏంటో కూడ ఖచ్చితంగా చెప్పప్పలేకపోయారు. రైతులకు మద్దతు అంటున్నారే కానీ మోదీ జగన్ ను నిలువరించకుండా ఉండటాన్ని ప్రశ్నించలేకపోయారు. తాజాగా అమరావతి శంఖుస్థాపన ప్రాంతాన్ని పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ పెబువాన్ కళ్యాణ్ వి పిల్ల చేష్టలని, అమరావతికి మద్దతు అంటూ శంఖుస్థాపనకు వచ్చిన మోదీని ఎందుకు నిలదీయట్లేదని అన్నారు. ఇలా అమరావతి నుండి మోదీని, మిత్రపక్షం జనసేనను శైలజానాథ్ నిలదీయడం అధికార వైసీపీలో కూడ ప్రాముఖ్యత సంతరించుకుందట. శైలజానాథ్ వ్యాఖ్యలకు బీజేపీ వైపు నుండి ఎలాంటి సమాధానం వస్తుందోనని ఎదురుచూస్తున్నారట వైసీపీ నేతలు.