తెలుగు రాష్ట్రాల్లో శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి.తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో భక్తులు పెద్దఎత్తున గోదావరి స్నానాలు ఆచరిస్తున్నారు. శ్రీశైలంలో తెల్లవారుజాము 2 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం మల్లికార్జున స్వామికి లింగోద్భవకాల మహాన్యాస రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటలకు శ్రీశైలం మల్లన్నకు పాగాలంకరణ, అనంతరం స్వామి, అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహించనున్నారు.

 

శ్రీకాళహస్తిలో వేకువజాము నుంచే దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు. స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. శ్రీకాళహస్తి ఆలయంలో మహా లఘు దర్శనం ఏర్పాటు చేశారు.

పంచారామక్షేత్రం అమరావతిలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమరలింగేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అమరలింగేశ్వర స్వామి క్షేత్రం శివనామస్మరణతో మార్మోగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తుతున్నారు. పున్నమిఘాట్‌, కృష్ణవేణి, పవిత్ర సంగమంతోపాటు నదీ పరివాహక ప్రాంతాల్లోని ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పాత శివాలయం, యనమలకుదురు శివాలయం, వేదాద్రి, ముత్యాలతోపాటు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శివయ్య దర్శనార్థం కోసం భక్తులు బారులు తీరారు. స్వామివారికి భక్తజనం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు.

దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ లో మహాశివరాత్రి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు బారులు తీరి రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుంటారు. దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది. శివన్నామస్మరణతో ఆలయప్రాంగణం మారుమ్రోగుతుంది. టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతా రెడ్డి, ఆలయ జేఈవో లక్ష్మయ్య, ఐజీ కుటుంబ సభ్యులు పట్టువస్త్రాలు సమర్పించారు.

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అలయాల్లో లింగరూపుడైనా శివున్ని దర్శించుకోని ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేవదేవుడైనా‌శివునికి పాలు, పత్రాలు సమర్పించి అభిషేకాలు నిర్వహిస్తున్నారు.