సాయి ధరమ్ తేజ్ పబ్లిక్ అప్పియరెన్స్ ఎప్పుడంటే.?

వినాయక చవితి రోజు సడెన్‌గా రోడ్డు ప్రమాదానికి గురైన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, దాదాపు నెల రోజులు ట్రీట్‌మెంట్ తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దసరాకి సాయి ధరమ్ తేజ్ ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లారు. చిన్నప్రమాదమే అన్నారు. కానీ, నెల రోజులు తేజ్ కోమాలోనే ఉన్నారన్న ప్రచారం జరిగింది. అయితే అదేం లేదు.. సాయి ధరమ్ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నాడని కుటుంబ సభ్యులు, ఆయన సన్నిహితులు చెప్పారు.

కానీ, ఇంతవరకూ తేజ్‌కి సంబంధించి ఒక్క ఫుల్ ఫోటో కూడా రిలీజ్ చేయలేదు. గతంలో తాను ఆరోగ్యంగా ఉన్నాను.. అంటూ ఓ ‘థమ్స్ అప్’ ద్వారా సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యాడు తేజ్. తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ సాయి తేజ్‌ని కలిశారు. ఆయన కూడా ‘ఫుల్లీ అండ్ మళ్లీ లోడెడ్’ అంటూ రెండు చేతులు కలిసి ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు.

ఫుల్లీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు తేజ్ ఫుల్ ఫోటో ఎందుకు రిలీజ్ చేయడం లేదు. తేజ్ ఆరోగ్యంపై ఎందుకింత గోప్యత పాటిస్తున్నారు.. అంటూ నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిన్న ప్రమాదానికి దాదాపు నెల రోజులు హాస్పిటల్‌లో ఉండడం, డిశ్చార్జ్ తర్వాత కూడా తేజ్ ఫోటోలు బయటికి రాకుండా జాగ్రత్త పడడం వెనుక అసలు కథేంటో.. అభిమానులకు అర్ధం కావడం లేదు. ఏది ఏమైతేనేం, పూర్తిగా కోలుకుని, తేజ్ బయటికి రావాలని, తను పూర్తి చేయాల్సిన సినిమాలను విజయవంతంగా పూర్తి చేయాలని ఆశిద్దాం.