Roja: వైకాపా మాజీ మంత్రి ఆర్కే రోజా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉంటారు. ఇటీవల పోసాని కృష్ణమురళి అరెస్టు గురించి ఈమె పూర్తిగా ఖండిస్తూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తాజాగా రెడ్ బుక్ గురించి రోజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని వైకాపా నేతలు లోకేష్ తీరు పై విమర్శలు కురిపించారు.
ఇలా అక్రమంగా వైసిపి నేతలపై కేసులు పెట్టి వారిని అరెస్టులు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఒక కేసు నుంచి బెయిల్ వచ్చేలోపు మరో కేసు పెట్టి వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి రోజా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.రెడ్ బుక్ రాజ్యాంగంతో మీరు సెంటీమీటర్ చేస్తే వైసిపి అధికారంలో వచ్చాక కిలోమీటర్ చేస్తామని తెలిపారు.
రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాజ్యాంగానికి విరుద్ధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని రోజా తెలిపారు. ఇక పోసాని విషయంలో కొంతమంది పోలీసులు కూడా చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఆయన ఒక కేసులో అరెస్టు అయ్యి బెయిల్ తెచ్చుకొనేలోపు మరొక కేసు పెట్టి తనని రాష్ట్రమంతా తిప్పుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం సరిలేకపోయిన టార్చర్ పెడుతున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తిలోదకాలు ఇచ్చి అధికార పార్టీ చెప్పినట్లు అధికారులు నడుస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు.
2029లో కచ్చితంగా వచ్చేది మా ప్రభుత్వమేనని అప్పుడు ఎవరైతే మమ్మల్ని ఇబ్బందులకు గురిచేశారో అధికారులు అలాగే కూటమి నేతలకు తప్పక మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది అంటూ రోజా చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.