ఏ పొలిటికల్ పార్టీలో అయినా వర్గపోరు కామన్. ఇక అధికార పార్టీలో అయితే అది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఒక్కోసారి ఈ వర్గపోరు మూలంగా సామర్థ్యం ఉన్న నేతలు కూడ బలవుతుంటారు. సరిగ్గా ఇదే సినారియో వైసీపీ ఎమ్మెల్యే రోజా విషయంలో జరుగుతోంది. రాజకీయాల్లో రోజా సామర్థ్యం ఏమిటో అందరికీ తెలుసు. ప్రతిపక్షంలో ఉండగానే పాలకవర్గాన్ని తన మాటల తూటాలతో భయపెట్టిన చరిత్ర రోజాగారిది. అలాంటి మహిళా నేత అధికారపార్టీలో ఉంటే ఆమెకు తప్పకుండా మంత్రి పదవిని కట్టబెట్టేవారే ఎవరైనా. కానీ వైసీపీలో అది కుదరడం లేదు. అలా కుదరకపోవడానికి కూడ కొన్ని ప్రత్యేకమైన కారణాలున్నాయి.
ఫైర్ బ్రాండ్ రోజా అంటే జగన్ కు కూడ అభిమానమే. ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కూడ ఎంతో ట్రై చేశారు. కానీ చిత్తూరు జిల్లా సామాజికవర్గ సమీకరణాల దృష్ట్యా ఆమెకు పదవి ఇవ్వలేకపోయారు. చిత్తూరు జిల్లా నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంతో రోజాకు మొండిచెయ్యి మిగిలింది. రోజానా, రామచంద్రారెడ్డా అనే పోలిక వస్తే అనుమానము లేకుండా జగన్ పెద్దిరెడ్డే అంటారు. కారణం పెద్దిరెడ్డి జగన్ కు గాడ్ ఫాదర్ లాంటి వారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన గత ఎన్నికల్లో జిల్లా మొత్తం వైసీపీ జెండా ఎగరడంలో ఎనలేని కృషి చేశారు. చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో ఈ ఘనత సాధించడం అంటే మామూలు విషయం కాదు.
అందుకే జగన్ పెద్దిరెడ్డిగారికి అమితమైన గౌరవం ఇస్తారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం వలన రోజాకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. దీంతో రోజాగారు బాధపడినా మెల్లగా సర్దుకున్నారు. కానీ ఇప్పుడు జగన్ గాడ్ ఫాదర్ రాజకీయం రోజాకు సొంత నియోజకవర్గంలో చిక్కులు తెచ్చి పెట్టిందట. నగరి వైసీపీలో రోజాకు వ్యతిరేక వ్యక్తులు కొందరు ఉన్నారు. ఆ వర్గాలతో రోజాకు అస్సలు పొసగదు. అలాంటిది ఆ వర్గంలోని ఒక మహిళా నేతకు బీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వబోతున్నారట. ఇది తెలుసుకున్న రోజా తీవ్రంగా అప్సెట్ అయ్యారట. దీని వెనుక పెద్దిరెడ్డిగారి రాజకీయం ఉందని, జిల్లాలో దూకుడుగా వెళ్తున్న రోజాకు రాజకీయంగా చెక్ పెట్టడానికే ఆమె వ్యతిరేక వర్గాన్ని ఎంకరేజ్ చేస్తున్నారని, ఇది రోజాకు అస్సలు నచ్చట్లేదని ప్రచారం జరుగుతోంది.