Kantara 2: రిషబ్ శెట్టి కాంతార 2 మూవీకి తప్పని తిప్పలు.. వరుసగా వెంటాడుతున్న విషాదాలు!

Kantara 2: రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కాంతార. ఈ సినిమాతో రిషబ్ శెట్టి భారీగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఎన్నో అవార్డులు సైతం అందుకున్నారు రిషబ్ శెట్టి. ఈ సినిమా ముందు వరకు రిషబ్ శెట్టి ఎవరు అన్నది చాలా మందికి తెలియదు. కానీ ఒక్కసారిగా ఈ సినిమాతో పాపులారీటి సంపాదించుకున్నారు. ఇది ఇలా ఉంటే కాంతార సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా కన్నడలో మొదటి విడుదల అయ్యి సంచలన విజయం సాధించడంతో ఆ తరువాత తెలుగులో విడుదల చేశారు.

తెలుగులో కూడా భారీగా కలెక్షన్లను రాబట్టింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా కాంతార 2 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు వినిపించిన వార్తలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో ఈ సినిమాకు వరుసగా విషాదాలు వెంటాడుతున్నాయి. ఈ సినిమాలో నటిస్తున్న ఆర్టిస్టులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. కొద్దిరోజుల క్రితం కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశాత్తు నదిలో పడి చనిపోయిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత కొద్ది రోజులకు ఇదే సినిమాలో పనిచేస్తున్న రాకేష్ పూజారి గుండెపోటుతో చనిపోయారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో నటిస్తోన్న మరో జూనియర్ ఆర్టిస్ట్ తుది శ్వాస విడిచారు. కేరళ లోని త్రిసూర్ కు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ విజు వికె బుధవారం అర్ధరాత్రి గుండె నొప్పితో కుప్పకూలాడు. ఇలా కొన్ని నెలల వ్యవధిలో కాంతార 2 సినిమాలో భాగమైన ముగ్గురు ఆర్టిస్టులు కన్ను మూయడం కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. త్రిసూర్ లో నివాసముండే విజు వికే కాంతార 2 సినిమా షూటింగ్ కోసం కర్ణాటకకు వచ్చారు. అగుంబే సమీపంలోని హోమ్ స్టేలో ఆయన బస చేశారు. అయితే బుధవారం రాత్రి ఆయనకు ఛాతీ నొప్పి వచ్చింది. వెంటనే ఆయనను తీర్థహళ్లిలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ మార్గ మధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని విజు కుటుంబ సభ్యులకు చేరవేయగా వారు వెంటనే కర్ణాటకకు బయలు దేరారు. అయితే ఈ సినిమాలోని నటులు వరుసగా ఇలా ఒకటి తర్వాత ఒకటి చనిపోవడం పట్ల కన్నడ ఇండస్ట్రీలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరుస విషాదాలతో ఈ సినిమా మూవీ మేకర్స్ కు తిప్పలు తప్పడం లేదు.