రాయలసీమ ముద్దుబిడ్డ vs భరతమాత ముద్దుబిడ్డ… వైసీపీ -బీజేపీల మధ్య చిచ్చు !

How the State Government will proceed in the case of the High Court

ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఉపఎన్నిక గురించే ప్రధానంగా చర్చ జరుగుతోంది. అటు ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నాయి. భారీ మెజారిటీ కోసం వైసీపీ, గెలుపు కోసం టీడీపీ.. ఉనికి కోసం బీజేపీ పోరాడుతున్నాయి. ఓ వైపు టీడీపీని విమర్శిస్తూనే.. ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందన్న ప్రచారాన్ని వైసీపీ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. దీనికి ధీటుగానే బీజేపీ కూడా జవాబిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైసీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సోమవారం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మధ్య ట్వీట్ల యుద్ధం జరిగింది.

తాజాగా రెండు పార్టీల మధ్య మరో వివాదం రాజుకుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రూపొందించిన పాటను.., బీజేపీ నేతలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మీద అదే ట్యూట్ తో పాట కట్టారు. ఇప్పుడు తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా అదే పాటను ప్రచారానికి వినియోగిస్తున్నారు కమలనాథులు.సీఎం జగన్ పై “రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న” పేరుతో వైసీపీ పాటను రూపొందించింది. ప్రముఖ గాయని మంగ్లీ చేత ఈ పాటను పాడించారు. ఎన్నికల సందర్భంగా ఇదే పాటను వినియోగించారు. అలాగే వైసీపీ కార్యక్రమాలు, పార్టీ విజయోత్సవాల్లో ఇదే పాటను ప్లే చేస్తుంటారు.

రాష్ట్రంలో ఈ పాట చాలా ఫేమస్ అయింది. ఐతే తాజాగా బీజేపీ నేతలు నరేంద్ర మోదీని కీర్తిస్తూ “భారతమాత ముద్దుబిడ్డ నరేంద్ర మోదీ” పేరుతో అదే ట్యూన్ పాటను రూపొందించారు. తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ నామినేషన్ సమయంలోనూ ఇదే పాటను వినియోగించారు. దీంతో బీజేపీ తమ పాటను కాపీ కొట్టిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాపీ కొట్టడం బీజేపీకి అలవాటేనని ఎద్దేవా చేశారు. తమ పాటలు, పథకాలను కాపీ కొట్టి లబ్ధిపొందాలని బీజేపీ చూస్తోందన్నారు. కొందరు నేతలైతే.. రాష్ట్రస్థాయిలో ఉన్న సీఎం జగన్ ఖ్యాతిని.. ఢిల్లీ స్థాయిలో బీజేపీ నేతలే వినిపిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. పాటను కాపీ కొట్టినా వైసీపీకి వచ్చే నష్టం లేదని చెప్తున్నారు. దీనిపై బీజేపీ నేతలు ఎలాంటి కామెంట్స్ చేయకపోయినా.. వైసీపీకి దొరికిపోయామే అనే భావనతో ఉన్నట్లు తెలుస్తోంది. పోయిపోయి సీఎం జగన్ పేరుతో పాపులర్ అయిన ట్యూన్ ను మోదీకి వినియోగించడం, అదే పాటను లిరిక్స్ మార్చి.. పాడించడంపై ఒకింత కమలనాథులు ఏమీ చెప్పలేకపోతున్నారు.