చిలక జోస్యమెవరిది.? రేవంత్ రెడ్డిదా.? కేటీయార్‌దా.?

‘రేవంత్ రెడ్డి చిలక జోస్యం చెబుతున్నారు.. హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డిపాజిట్లు వస్తే అది గొప్ప విషయం. అసలు కాంగ్రెస్ పార్టీ, హుజూరాబాద్‌లో నిజంగానే పోటీ చేస్తోందా.?’ అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సెటైరేశారు.

కేసీయార్ ఉప రాష్ట్రపతి.. అంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారనీ, సందర్భాన్ని బట్టి జాతీయ రాజకీయాల్లో కేసీయార్ తనదైన సత్తా చాటుతారనీ మంత్రి కేటీయార్ చెప్పుకొచ్చారు. ‘వాట్సాప్ యూనివర్సటీ’ ప్రచారాల్ని పట్టించుకోవాల్సిన పనిలేదని కేటీయార్ సెటైర్లేశారు.

కాగా, కొడంగల్‌లో ఓడితే రాజకీయ సన్యాసం చేస్తానన్న రేవంత్ రెడ్డి, మాట నిలబెట్టుకోలేదని కేటీయార్ ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి బంపర్ విక్టరీ సాధిస్తుందన్న మంత్రి, నవంబర్ 15న వరగల్‌లో విజయగర్జన సభ కనీ వినీ ఎరుగని స్థాయిలో నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలో పోటీ టీఆర్ఎస్ – బీజేపీ మధ్య వుంటుందన్న కేటీయార్, ఈ పోటీ కూడా ఏకపక్షమే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈటెల రాజేందర్‌ని తెలంగాణ రాష్ట్ర సమితి మోసం చెయ్యలేదు.. రాజకీయంగా పేరు ప్రఖ్యాతుల్ని టీఆర్ఎస్ పార్టీ ద్వారా పొంది, టీఆర్ఎస్ పార్టీకి ఈటెల రాజేందర్ వెన్నపోటు పొడిచారన్నది కేటీయార్ వాదన.

‘జానారెడ్డి కంటే ఈటెల రాజేందర్ బలవంతుడా.?’ అని కేటీయార్ ప్రశ్నించడం గమనార్హం. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో జానారెడ్డి, గులాబీ పార్టీ చేతిలో ఓడిపోయిన విషయం విదితమే. అయితే, దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్ చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయిన విషయాన్ని గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మర్చిపోతే ఎలా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పుడైనా ఎలాగైనా మారిపోవచ్చు. కాంగ్రెస్ ప్రస్తుతానికి హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించినంతవరకు డీలాపడింది. కానీ, పోలింగ్ రోజు నాటికి పరిస్థితులు ఎలా వుంటాయో. బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్, సిట్టింగ్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకీ అనుకూలత ఎక్కువగానే వుంటుంది.

దుబ్బాకలో టీఆర్ఎస్ అంచనాలు చిలక జోస్యాన్నే తలపించాయి. మరి, హుజూరాబాద్ విషయంలో కేటీయార్ ధీమా కూడా చిలక జోస్యమే అవుతుందా.? వేచి చూడాల్సిందే.