సన్నాసులపై మాజీ సీఎస్ ఐవైఆర్ ఫైర్.. సబబేనా ఇది.?

ఎవరు సన్నాసులు.? ఎవరు మేధావులు.? సీనియర్ ఐఏఎస్ (రిటైర్డ్) అదికారి ఐవైఆర్ కృష్ణారావు తన ట్వీటు మీద అదుపు కోల్పోయారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గతంలో పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్న విషయం విదితమే. ప్రభుత్వాలు చేస్తున్న అప్పుల విషయమై జన బాహుళ్యంలో పెద్ద చర్చే జరుగుతోంది. రాష్ట్రాలు, రాష్ట్రాలకు మించి కేంద్రం.. అప్పులు చేయడంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇలా అప్పులు చేస్తున్నది ప్రజల్ని ఉద్ధరించడానికేనా.? అన్న అనుమానం ప్రజల్లోనే కలుగుతోంది. ఇదే డౌటానుమానం ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశారు. అంతే, ఐవైఆర్ కృష్ణారావుకి కోపమొచ్చేసింది. ‘ఈ ప్రశ్న వేసే సన్నాసుల అందరికీ ఒక్క సమాధానం. వంద రూపాయలు అప్పు తీసుకొని 20 రూపాయలు పప్పు బెల్లాలు పంచితే సమస్య వుండదు. కేంద్రం చేస్తున్నది అది.

వంద రూపాయలు అప్పు తీసుకొని పన్నులు అప్పు కలిపి 150 రూపాయలు పంచే ఏ ప్రభుత్వమైనా దివాలా తీయడానికి ఎక్కువ రోజులు పట్టదు..’ అంటూ ట్వీటేశారు ఐవైఆర్. మిగతా వివరణని తప్పు పట్టలేం. ‘సన్నాసులు అందరికీ సమాధానం’ అనడమే సబబుగా లేదు. రాజకీయ నాయకులు నోటికొచ్చింది వాగితే అది వేరే లెక్క. ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు ఐవైఆర్ కృష్ణారావు. అయితే, ఆయనిప్పుడు బీజేపీ నాయకుడు. సో, రాజకీయ లక్షణాలు అలా ఒంటికి పట్టేశాయన్నమాట. ప్రజలు ప్రశ్నిస్తారు, ఆ ప్రజల మీద నాయకులు ఇలా విరుచుకుపడితే దాన్ని ప్రజాస్వామ్యం అనగలమా.? ఎవరు సన్నాసులు.? ఎవరు మేధావులు.? దీన్ని డిసైడ్ చేయగలిగేది ఎవరు.? ఏ ప్రభుత్వం అప్పు చేసినా, ప్రజలకు లాభం వుంటుందో లేదోగానీ.. నష్టమైతే ఖచ్చితంగా వుంటుంది. ఎందుకంటే, అప్పులకు వడ్డీలు సైతం కట్టాల్సింది ప్రజలే.