ఉదయం లేవగానే ఒక కప్పు టీ.. ఆఫీస్‌లో బ్రేక్ టైమ్‌లో మరో కప్పు.. చాలామందికి టీ అనేది అలవాటు కాదు, అవసరం. కానీ ఆ టీనే ఆరోగ్యానికి ముప్పుగా మారుతుందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. టీ తయారైన వెంటనే కాకుండా ఆలస్యంగా తాగడం, మళ్లీ మళ్లీ వేడి చేసి తాగడం వల్ల కాలేయం, జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా టీ తయారు చేసిన 15 నుంచి 20 నిమిషాల లోపే తాగితేనే అది సురక్షితమని పరిశోధకులు సూచిస్తున్నారు.
టీ తయారైన తర్వాత కొంతసేపు ఉంచితే అందులో బ్యాక్టీరియా పెరగడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. గాలిలోని సూక్ష్మజీవులు, పాలలో ఉండే పోషకాలు కలిసిపోవడంతో టీ త్వరగా చెడిపోతుంది. అందుకే జపాన్, చైనా వంటి దేశాల్లో నిల్వ చేసిన టీని తాగడాన్ని ప్రమాదకరంగా భావిస్తారు. అక్కడ 24 గంటలకు పైగా ఉంచిన టీని తాగడం విషంతో సమానమని ప్రజల నమ్మకం. ఈ కారణంగానే చైనాలో నిల్వ చేసిన టీని అస్సలు ముట్టుకోరు.
పాలు కలిపిన టీ విషయంలో మరింత జాగ్రత్త అవసరం. పాలు సహజంగానే త్వరగా పాడయ్యే లక్షణం కలిగి ఉంటాయి. పాలతో చేసిన టీని గది ఉష్ణోగ్రత వద్ద రెండు గంటలకంటే ఎక్కువ ఉంచితే బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. ఫ్రిజ్‌లో ఉంచితే ఒకటి నుంచి మూడు రోజులు నిల్వ చేయవచ్చని నిపుణులు చెబుతున్నా.. ఆ టీని మళ్లీ మళ్లీ వేడి చేయడం మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా చేయడం వల్ల టీ లోని పోషక విలువలు నశించడమే కాకుండా ఆమ్లత్వం పెరిగి గ్యాస్, మంట, జీర్ణ సమస్యలు మొదలవుతాయి.
అల్లం టీ విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. పాలు కలపకుండా తయారు చేసిన అల్లం టీని ఫ్రిజ్‌లో ఉంచితే మూడు నుంచి ఐదు రోజుల వరకు నిల్వ చేయవచ్చు. అయితే తాగే ముందు బాగా మరిగించాలి. టీ రంగు మారడం, దుర్వాసన రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పారేయాలి. అలాగే రోజుకు 4 నుంచి 5 గ్రాముల కంటే ఎక్కువ అల్లం తీసుకుంటే కొంతమందిలో గుండెల్లో మంట, అసౌకర్యం వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
ఆయుర్వేదం కూడా టీని నిల్వ చేయడం, మళ్లీ వేడి చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఇలా చేసిన టీ శరీరంలో విషపదార్థాలను పెంచి జీర్ణక్రియను మందగిస్తుంది. టీని పదే పదే మరిగించడం వల్ల అందులోని ప్రోటీన్లు, సహజ గుణాలు నశిస్తాయి. దీని ఫలితంగా ఆమ్లత్వం, అలసట, కడుపు మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే టీ తాగాలనుకుంటే ప్రతిసారీ తాజాగా తయారు చేసుకోవడమే ఆరోగ్యానికి మేలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒక చిన్న అలవాటు పెద్ద సమస్యగా మారకముందే.. మీ టీ కప్పు తాజాగా ఉందా లేదా అన్న విషయాన్ని సరిచూసుకోండి.
