మల్లారెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డ: టీడీపీ నాటి తగాదాలేనా.?

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య రాజకీయంగా పెద్ద రచ్చే జరుగుతోంది. మంత్రి మల్లారెడ్డి అక్రమాలకు పాల్పడ్డారనీ, అవినీతి పనులు చేస్తున్నారనీ రేవంత్ రెడ్డి ఆరోపిస్తోంటే, రేవంత్ రెడ్డి మీద జుగుప్సాకరమైన రీతిలో మాటల దాడికి దిగుతున్నారు మల్లారెడ్డి. ఈ ఇద్దరి మధ్యా విమర్శల జోరు కాస్తా ముదిరి పాకాన పడింది. ‘రాజీనామా’ సవాళ్ళు కూడా విసురుకున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేయాలని మల్లారెడ్డి, రేవంత్ రెడ్డికి సవాల్ విసిరితే.. మొత్తంగా ప్రభుత్వాన్నే రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళేలా కేసీయార్‌ని ఒప్పించాలని మల్లారెడ్డికి రేవంత్ రెడ్డి సవాల్ విసిరేశారు. అసలు ఈ గొడవ అంతా ఎక్కడ మొదలైంది.? తన విద్యా సంస్థల కోసం మల్లారెడ్డి నిజంగానే భూ కబ్జాకి పాల్పడ్డారా.? అంటే, ‘జిరాక్స్ పేపర్లు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి అల్లరి చేస్తున్నారు..’ అన్నది మల్లారెడ్డి వాదన.

‘టీడీపీలో వున్నప్పటినుంచే రేవంత్ రెడ్డి నా మీద కక్ష కట్టాడు..’ అంటూ మల్లారెడ్డి కొత్త పాయింటుని లేవదీశారు. గతంలో రేవంత్ రెడ్డి, మల్లారెడ్డి.. ఇద్దరూ టీడీపీలోనే వుండారు. టీడీపీ నుంచే మల్లారెడ్డి ఎంపీగా గెలిచారు. అప్పట్లోనే మల్లారెడ్డికీ, రేవంత్ రెడ్డికీ మధ్య రాజకీయ వైరం వుందట. మల్లారెడ్డి పోటీ చేసిన సీటుని ఆశించి రేవంత్ రెడ్డి భంగపడ్డారట. ఇదంతా నమ్మేలా వుందా.? అప్పటికి రేవంత్ రెడ్డి, టీడీపీలో కీలక నేత. మల్లారెడ్డి సాదా సీదా నేత. ఏమో, అప్పట్లో ఏం జరిగిందోగానీ.. ఆనాటి ఆ టీడీపీ వైరాన్ని ఇప్పుడు మల్లారెడ్డి తెరపైకి తీసుకొస్తుండడం హాస్యాస్పదమే. పూర్తిగా కార్నర్ అయిపోయాక మల్లారెడ్డి అర్థం పర్థం లేని రీతిలో ఆనాటి వ్యవహారాల్ని ప్రస్తావిస్తున్నారన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోంది.