వైఎస్ జగన్‌పై వైఎస్ షర్మిల ఇన్‌డైరెక్ట్ ఎటాక్ వెనుక.!

‘నేను అన్న వైఎస్ జగన్ వదిలిన బాణాన్ని కాదు..’ అనిపించుకోవడం తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిలకి చాలా చాలా పెద్ద టాస్క్. అన్నా చెల్లెళ్ళ మధ్య రాజకీయంగా విభేదాలు వుంటాయని ఎవరైనా అనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. తెలంగాణ రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు. ఓ చోట రాజకీయం చేస్తున్న పార్టీ, ఇంకో చోట రాజకీయం చేయడం (ప్రాంతీయ పార్టీలైనా, జాతీయ పార్టీలైనా) కష్టం.

నీళ్ళు, విద్యుత్, ప్రాజెక్టుల విషయమై.. ఇరు రాష్ట్రాల మధ్యా వాదనల్లో పొంతన వుండదు. అదే అసలు సమస్య. అందుకే, వైఎస్ షర్మిల కూడా అత్యంత వ్యూహాత్మకంగా నడుస్తున్నారు. కానీ, నడిపిస్తున్నది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అంటారు చాలామంది. అందుకే, ఆ ముద్రని తొలగించుకునేందుకు వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడంలేదు వైఎస్ షర్మిల.

ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయమై వైఎస్ షర్మిల, తన అన్న వైఎస్ జగన్ ఆలోచనల్ని తప్పు పడుతున్నారు. పేరు మార్చితే, నాయకుల్ని అవమానపర్చినట్లేనని షర్మిల కుండబద్దలుగొట్టేశారు. ఇది వైసీపీకి అస్సలేమాత్రం మింగుడుపడ్డంలేదు. అన్న రాజకీయం వేరు, చెల్లెలి ఆలోచనల వేరు.. అన్న సంకేతాలు ఈ వ్యవహారంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయాయ్.

నిజానికి, షర్మిల అలా వ్యాఖ్యానించడం వల్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పెద్దగా వచ్చే నష్టం లేదు. పార్టీలో ఒకరిద్దరు నేతలు తన నిర్ణయాన్ని వ్యతిరేకించినా, దాన్ని వైఎస్ జగన్ అధిగమించగలరు. పార్టీతో సంబంధం లేని షర్మిల చేసే వ్యాఖ్యల్ని వైఎస్ జగన్ ఎందుకు పరిగణనలోకి తీసుకుంటారు.?

కాగా, షర్మిల వ్యాఖ్యల్ని టీడీపీ అనుకూల మీడియా స్పెషల్‌గా కోట్ చేస్తోంది. టీడీపీ అయితే, ‘చెల్లెలికి వున్న బుద్ధిలో పదో వంతైనా అన్నకు లేదాయె..’ అంటూ వెటకారాలు చేస్తోంది. ఎవరేం మాట్లాడినా, అన్నాచెల్లెళ్ళ మధ్య ఖచ్చితమైన అవగాహన అయితే స్పస్టంగా కనిపిస్తోంది.