నిజమేనా.! వైసీపీ ‘నైతిక విలువల్ని’ పాటిస్తోందా.?

really-ysrcp-following-moral-values

really-ysrcp-following-moral-values

రాజకీయాల్లో ఏది తప్పు.? ఏది ఒప్పు.? అనేది తేల్చడం చాలా కష్టం. యుద్ధంలో గెలవడానికి ఒక్కోసారి అడ్డదార్లు తొక్కినాసరే అది తప్పులేదనే భావన వుంది. రాజకీయాల్ని ప్రజాసేవ, ప్రజాస్వామ్య పరిరక్షణ అన్న కోణంలో కాకుండా, రాజకీయ పార్టీల మధ్య యుద్ధంగా భావిస్తున్న రోజులివి. ఎన్నికలంటేనే, యుద్ధం కింద లెక్క. అందులో గెలుపోటములే కీలకం.

ఇక్కడ, నైతికత అన్న మాటకు అర్థమే లేదు. నైతిక విలువల గురించి మాట్లాడుకుంటే అదో పెద్ద బూతు. మునిసిపల్ ఎన్నికల్లో విపక్షాలకు చెందిన అభ్యర్థుల్ని ప్రలోభపెట్టి, అవసరమైతే బెదిరించి.. వారితో నామినేషన్లను ఉపసంహరింపజేసింది అధికార పక్షం. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ జరిగిన వ్యవహారమిది. ఇది బాహాటంగానే జరిగింది. ఓటర్లకు డబ్బులు పంచడం.. సంక్షేమ పథకాల్ని ఊడబీకేస్తామని బెదిరించడం.. ఇవన్నీ అధికార పార్టీ నుంచి జరిగాయి. ఎన్ని చేసినా సరే, అంతిమంగా గెలుపే ముఖ్యం. ఆ గెలుపు వైసీపీకి దక్కేసింది. చివర్లో చిన్న పంచ్.. తాడిపత్రి మునిసిపల్ ఛైర్మన్ ఎంపిక సందర్భంగా ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని గెలిపించేసింది వైసీపీ. కాదు కాదు, తమవైపుకు వచ్చేయనున్న టీడీపీ నేతకు సహకరించింది. ఇంకేముంది.? జగన్ నైతికత గురించి వైసీపీ ప్రచారం చేసుకోవడానికి బోల్డంత అవకాశం దొరికింది.

ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తే ఈ పాటి పబ్లిసిటీ వస్తుందట.? చాలా ఉచితంగా వైసీపీకి, వైసీపీ అధినేతకి పబ్లిసిటీ దొరికినట్లయ్యింది. గతంలో చంద్రబాబు సర్కార్ కూడా ఇలాంటి వ్యవహారాలు చాలానే చేసింది. అంతిమంగా, ప్రజలు అన్నటినీ గమనిస్తారు. అయితే, అప్పటికీ ఇప్పటికీ చిన్న తేడా వుంది.. చంద్రబాబు ఘీంకారాలు ఎక్కువగా చేసేవారు అధికారంలో వున్నప్పుడు. ప్రతిపక్షంలో వున్నా అవి తగ్గడంలేదు. కానీ, వైఎస్ జగన్ అలా కాదు. పంచాయితీ, మునిసిపల్ ఎన్నికల్లో ఎక్కడా ఆయన ప్రచారం చేయలేదు.. వాటి గురించి అధికారికంగా మాట్లాడలేదు కూడా.. ప్రక్రియ మొదలయ్యాక. అదీ చంద్రబాబుకీ, జగన్‌కీ తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్.