ఆరోగ్యమే మహాభాగ్యం…ఏం ఉన్నా లేకపోయినా, జీవితానికి అదొక్కటి ఉంటే చాలు. ఆరోగ్యాన్నిచ్చే ఆహారపదార్థాల గురించి తెలుసుకోవటం అవసరం. నిత్యం మనం ఉపయోగించే వాటిలో కొన్నింటి వల్ల కలిగే మేలు గురించి తెలుసుకుందాం.
పసుపు:
రక్త శుద్ధి చేయటమే కాక కఫం, వాత, పిత్త రోగాలను నయం చేసే గుణం కలిగివుంది. పసుపులో శనగ పిండి కలుపుకుని నీటితో పేస్ట్ గా చేసుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే ఫేస్ లో గ్లో వస్తుంది. జలుబు, పొడి దగ్గు సమస్యలు తలెత్తినప్పుడు పసుపును వేడి నీటిలో లేదా పాలలో కలుపుకుని సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. దీంతో గొంతులో, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం బయటకు వచ్చేస్తుంది. పసుపు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
అల్లం:
అజీర్తితో బాధపడుతున్న వారు ‘అల్లం’ కషాయాన్ని సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. ఉదరంలో గ్యాస్ ఏర్పడితే అల్లం దివ్యౌషధంలా పనిచేస్తుంది. దగ్గు, జలుబు, కఫం మొదలైన వాటికి అల్లం అమృతంలా పనిచేస్తుందనడంలో సందేహం లేదు. ఉబ్బసపు వ్యాధితో బాధపడే వారు అల్లం రసంలో తేనెను కలుపుకుని సేవిస్తే ఉబ్బసం నుంచి ఉపశమనం కలగడమే కాకుండా ఆకలి బాగా వేస్తుంది. జీర్ణక్రియ సాఫీగా జరిగేలా అల్లం ఉపయోగపడుతుంది.
మెంతులు:
మధుమేహ రోగులకు ‘మెంతులు’ దివ్యౌషధంలా పనిచేస్తాయని ఆయుర్వేద వైద్యులు చెప్తుంటారు. ప్రతిరోజు మెంతులు తీసుకోవడం వలన రక్తం పలుచగా తయారవుతుంది. నిత్యం పరకడపున మెంతుల చూర్ణం లేదా మెంతుల కాషాయం తీసుకుంటే మొకాళ్ళ నొప్పులతోపాటు మధుమేహ వ్యాధి అదుపులోవుంటుంది. వీటితోపాటు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడంలో ఉపయోగపడుతుంది.
జీలకర్ర:
జీలకర్ర జీర్ణక్రియను సాఫీగా ఉంచుతుంది. కడుపు ఉబ్బరంగా ఉండటం, ఆహారం తినాలని అనిపించకకపోవడం, అజీర్తి లాంటి వాటితో సతమతమౌతుంటే జీలకర్ర కషాయాన్ని ఉపశమనం కలుగుతుంది. జీలకర్ర ద్రవాన్ని తాగితే ఆ రోజంతా మీరు ఫ్రెష్‌గా ఉంటారు. జీలకర్ర వల్ల బరువు తగ్గుతుందని, కొవ్వును కొవ్వును తగ్గించడంతోపాటు చెడు కొవ్వును చేరకుండా కాపాడుతుందని పరిశోధనలో తేలింది.
ధనియాలు:
ధనియాల వలన కంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. 20గ్రాముల ధనియాలను ఒక గ్లాసు నీళ్లలో వేసి మరిగించి, పరిశుభ్రమైన నూలుగుడ్డతో వడపోసి, ఒక్కో కంట్లో రెండేసి చుక్కల చొప్పున వేసుకోవాలి. ప్రతిరోజూ ధనియాలతో తయారుచేసిన తాజా కషాయంతో కళ్లను శుభ్రపరచుకుంటుంటే కంటి సమస్యలు ఇబ్బంది పెట్టవు. కళ్ల కలక, కళ్లమంటలు, కళ్ల దురదలు, కళ్లనుంచి నీళ్లు కారటం వంటి కంటికి సంబంధించిన సమస్యల్లో ఇది చాలా లాభప్రదంగా ఉంటుంది.