ఉద్యమించింది అమరావతి రైతులే అయినా, రాయలసీమలోనూ వైఎస్ షర్మిల తీరు పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్న షర్మిల, తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలపై ఇటీవల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, తెలంగాణ తరఫున వకాల్తా పుచ్చుకున్న విషయం విదితమే.
తాను తెలంగాణలో పెరిగానంటూ షర్మిల చెప్పుకున్నా, ఆమె తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాయలసీమ వాసి. ‘రాయలసీమ ముద్దు బిడ్డ’గానే రాజశేఖర్ రెడ్డి అలాగే వైఎస్ జగన్, షర్మిలను చూస్తుంటారు రాయలసీమ వాసులు. అలాంటప్పుడు, తెలంగాణలో రాజకీయ పార్టీ పెడుతున్నంతమాత్రాన, రాయలసీమ ప్రయోజనాల గురించి షర్మిల మాట్లాడకపోతే ఎలా.? కొందరు కుట్రపూరితంగా షర్మిల ఇంటి వద్ద ఈ రోజు ధర్నా చేశారన్నది షర్మిల అనుచరుల వాదన. అందులో కొంత నిజమే వుండి వుండొచ్చు.
కానీ, రాజకీయ పార్టీ పెడుతున్న షర్మిల, తెలంగాణ సమస్యలే కాదు, ఆంధ్రపదేశ్ సమస్యల్ని కూడా అడ్రస్ చేయాల్సిందే. రాయలసీమలో ఇప్పుడిప్పుడే షర్మిలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా తయారైంది. నిజానికి షర్మిల 2019 ఎన్నికల్లో తెలంగాణలో వైసీపీ తరఫున ప్రచారం చేయలేదు. అసలు వైసీపీ, తెలంగాణలో పోటీనే చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఆమె ప్రచారం నిర్వహించారు.. వైసీపీ గెలుపు కోసం కష్టపడ్డారు. అలాంటప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఆమె మాట్లాడాల్సిందే కదా.?