చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహాలు అందరితో పోలిస్తే కొద్దిగా డిఫరెంట్. సొంత బలం మీద కంటే ప్రత్యర్థి బలహీనత మీద పునాదులు వేసుకోవాలనేది ఆయన ఫార్ములా. అది బాగానే వర్కవుట్ అయింది కూడ. ప్రత్యర్థుల్లో లొసుగులు పట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆ విద్యను పార్టీ నేతలకు కూడ అలవాటు చేశారు. దశాబ్దాల తరబడి టీడీపీలో ఉన్న పలువురు సీనియర్ లీడర్లు ఇదే పంథాలో పోతున్నారు. వారిలో జమ్మలమడుగు నేత రామసుబ్బారెడ్డి కూడ ఒకరు. రామసుబ్బారెడ్డి కుటుంబం మొదటి నుండి టీడీపీలోనే ఉంటూ వచ్చింది. శివారెడ్డి తర్వాత వారసత్వాన్ని రామసుబ్బారెడ్డి తీసుకుని టీడీపీని నడిపిస్తూ వచ్చారు. టీడీపీ నుండి 94, 99లో ఎమ్మెల్యేగా గెలిచారు.
కానీ రాజశేఖర్ రెడ్డి హవా మొదలైనప్పటి నుండి ఆయన ఓడిపోతోన్న ఉన్నారు. 2004 మొదలుకుని 2019 ఎన్నికల వరకు టీడీపీ తరఫునపోటీ చేసి ఓడిపోయారు. 2004, 2009, 2014లో కాంగ్రెస్ నేత ఆదినారాయణ రెడ్డి చేతిలో ఓడిపోతూ వచ్చిన ఆయన 2019 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి సుధీర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే గతంలో అయిపోయిన కూడ ఆయన పలుకుబడి, పెద్దరికం ఎక్కడా తగ్గలేదు. కానీ 2019 ఓటమి తర్వాత వైకాపాలో చేరడమే ఆయన చేసి పెద్ద పొరపాటు అయింది. వైసీపీలోకి వెళ్ళాక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి డామినేషన్ తట్టుకోలేకపోయారు ఆయన. ఎంత కలిసిపోదామనుకున్నా సుధీర్ రెడ్డి కలుపుకోలేదు. అవమానాలు పెరిగాయి. వైరం మరింత ముదిరింది.
దీంతో పార్టీ తప్పుచేశానని భావించిన రామసుబ్బారెడ్డి కొన్నాళ్ళు మౌనంగా ఉండటమే మంచిదనుకుని సైలెంట్ అయిపోయారు. పార్టీ తరపున కాకుండా సొంత ఎజెండాతో ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు కలిసివచ్చే కాలం మొదలైంది. సుధీర్ రెడ్డి మీద వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి మొదలైంది. సుధీర్ రెడ్డి అధినాయకత్వాన్ని, శ్రేణులను ఏమాత్రం పట్టించుకోవట్లేదని, ఇష్టానుసారం వెళుతున్నారని మండిపడుతున్నారు లోకల్ లీడర్లు. కొత్తగా ఇప్పుడు తాను జగన్ వల్ల గెలవలేదనే ఫీలింగులోకి వెళ్లారట ఆయన. ఇది శ్రేణులను మరింత నొప్పిస్తోంది. దీన్నే అవకాశంగా మలుచుకున్న రామసుబ్బారెడ్డి సుధీర్ రెడ్డి వైనాన్ని పూసగుచ్చినట్టు క్యాడర్ ముందు ఉంచుతున్నారని, వారిని మెల్లగా తనవైపుకు తిప్పుకుంటున్నారని అంటున్నారు. ఇంకొన్నాళ్ళు ఇలాగే సాగితే రామసుబ్బారెడ్డి బలపడి వచ్చే ఎన్నికల నాటికి వైసీపీలో సమీకరణాలు మారిపోవడం ఖాయం అంటున్నారు.