కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం అంటే ఫ్యాక్షన్ రాజకీయాలు టక్కున కాళ్ళ ముందు మెదులుతాయి. ఆ తరహా రాజకీయాలు ఒకప్పుడు ఉండేవి కానీ ఇప్పుడు లేవు. కానీ వాటిల్లోంచి నాయకులుగా పుట్టినవారు అక్కడ రాజకీయాలను శాసిస్తున్నారు. ఒకప్పుడు జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి, ఆదినారాయరెడ్డిల మధ్యనే రాజకీయ పోరు నడిచేది. రామసుబ్బారెడ్డి కుటుంబం మొదటి నుండి టీడీపీలోనే ఉంటూ వచ్చింది. శివారెడ్డి తర్వాత ఆయన వారసత్వాన్ని రామసుబ్బారెడ్డి తీసుకుని టీడీపీని నడిపిస్తూ వచ్చారు. టీడీపీ నుండి 94, 99లో ఎమ్మెల్యేగా గెలిచారు.
కానీ ఆదినారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి రాజకీయ చేయడం, ఆయన వెనుక వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండటంతో రామసుబ్బారెడ్డికి వరుస ఓటములు తప్పలేదు. 2004 నుండి 2014 వరకు ఆదినారాయణరెడ్డి చేతులో వరుసగా ఓడిపోయారు. అయినా ఆయన టీడీపీలోనే ఉన్నారు. కానీ 2019 న్నికలకు ముందు ఆదినారాయణరెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో ముసలం మొదలైంది. రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు అసెంబ్లీ నుండి ఆదినారాయణరెడ్డి ఎంపీ టికెట్ మీద పోటీచేసి ఓడిపోయారు. దీంతో రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరగా ఆదినారాయణరెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు.
వైసీపీలో చేరిన నాటి నుండి అక్కడి వైసీపీ ఎమ్మెల్యేకు రామసుబ్బారెడ్డికి వార్ మొదలైంది. టీడీపీలో ఉన్నన్ని రోజులూ పదవి ఉన్నా లేకున్నా రామసుబారెడ్డి అంటే నియోజకవర్గంతో పాటు జిల్లాలో కూడ ఒక హవా ఉండేది. పార్టీకి పెద్ద దిక్కుగా మంచి హోదా అనుభవించారు ఆయన. కానీ వైసీపీలో అది లేకుండా పోయింది. అంతా వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిదే రాజ్యం. రామసుబ్బారెడ్డి ఎలాంటి పరపతి లేకుండా మిగిలిపోయారు. దీంతో టీడీపీలో ఉన్నప్పుడు బోలెడంత దర్జా ఉండేది. అనవసరంగా పార్టీని వీడి తప్పుచేశాను అంటూ కేడర్ వద్ద చింతాక్రాంతులవున్నారట ఆయన.